రేపు ఒడిశాలో పీఎం నరేంద్ర మోదీ పర్యటన... నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

Cyclone Fani Updates : ఫొణి తుఫానుతో కకావికలమైన ఒడిశాలోని పూరీ క్షేత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పరిశీలించబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 5, 2019, 5:38 AM IST
రేపు ఒడిశాలో పీఎం నరేంద్ర మోదీ పర్యటన... నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
ఫొణి తుఫానుతో కకావికలమైన పూరీ
  • Share this:
ఫొణి తుఫాను వల్ల ఒడిశా రాష్ట్రం ఎంతలా నష్టపోయిందో మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అంచనా వెయ్యలేనంతగా నష్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించి వాస్తవ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోబోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలిపారు. సీఎం నవీన్ పట్నాయక్‌కి కాల్ చేసిన మోదీ... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫొణి తుఫాను వల్ల ఇప్పటివరకూ 12 మంది చనిపోగా... 5 వేల గ్రామాలు, 50 పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలకు తోడు... గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల వేల చెట్లు, కరెంటు స్తంభాలూ, సెల్ ఫోన్ టవర్లు నేలకూలాయి. రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం 34 విపత్తు నిర్వహణ బృందాలు (NDRF) పునరావాస చర్యల్లో తలమునకలయ్యాయి.


ఫొణి తుఫాను శనివారం మధ్యాహ్నం తర్వాత బెంగాల్‌ను తాకింది. బెంగాల్‌లో 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను విషయంలో భారత ప్రభుత్వాలు, వాతావరణ శాఖ కచ్చితమైన అంచనాలతో ముందుకెళ్లాయనీ, అందువల్ల ప్రాణనష్టం చాలా తక్కువగా జరిగిందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డిపార్ట్‌మెంట్ బాగా పనిచేసిందని మెచ్చుకుంది. ఒడిశాలో 1999లో దాదాపు ఇలాంటి సూపర్ సైక్లోనే వచ్చింది. అప్పట్లో 10 వేల మంది దాకా చనిపోయారు. ఐతే 2013లో ఫైలిన్ తుఫాను వచ్చినప్పటి నుంచీ మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం భారత్ చేపడుతున్న అప్రమత్త చర్యలేనని ఐరాస పొగడ్తల వర్షం కురిపించింది.

ఫొణి తుఫాను శ్రీకాకుళం జిల్లాపై మరోసారి తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ మొత్తం 4 మండలాల్లోని 145 గ్రామాలపై తుఫాను ప్రభావం కనిపించింది. మొత్తం 2,129 కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. 1,148 హెక్టార్లలో పంట నష్టం కలిగింది. 7,000కు పైగా కొబ్బరి చెట్లు నేల రాలాయి. 162 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా రూ.38.43 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.ప్రస్తుతం ఫొణి తుఫాను బలహీనపడి ఈశాన్య రాష్ట్రాలవైపు మళ్లింది. ఐతే... ఇక దాని ప్రభావం అంత ఎక్కువగా ఉండదని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
First published: May 5, 2019, 5:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading