• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CYCLONE BUREVI KERALA AND TAMIL NADU ON ALERT AS CYCLONE BUREVI NEARS SU

Cyclone Burevi: దూసుకొస్తున్న బురేవి తుపాన్.. 72 గంటల పాటు భారీ వర్షాలు

Cyclone Burevi: దూసుకొస్తున్న బురేవి తుపాన్.. 72 గంటల పాటు భారీ వర్షాలు

బురేవి తుపాన్ (Image:Windy)

Cyclone Burevi: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి బురేవి తుపాన్‌గా మారింది. బురేవి తుపాన్ తీరం వైపు దూసుకోస్తుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.

  • Share this:
    నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి బురేవి తుపాన్‌గా మారింది. బురేవి తుపాన్ తీరం వైపు దూసుకోస్తుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. బురేవి తుపాన్ శుక్రవారం తిరువనంతపురాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, తుపాన్ ప్రభావంతో నేటి నుంచి 72 గంటల పాటు కేరళలోని ఏడు జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నట్టు అధికారులు తెలిపారు. కేరళ రాజధాని తిరువనంతపురంతో పాటు మరో ఆరు జిల్లాలపై బురేవి తీవ్ర ప్రభావాన్ని చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరువనంతరపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజలకు రెడ్ అలర్ట్ జారీచేసింది.

    బురేవి తుపాన్ తొలుత శ్రీలంక ఉత్తర తీరాన్ని తాకుంతుందని.. ఈ ప్రభావంతో భారీ వర్షాలతో పాటు గంటకు 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. మన్నార్, గల్ఫ్ ప్రాంతాలను దాటిన తర్వాత బురేవి బలహీన పడుతుందని అన్నారు. అయితే అప్పటికీ దీని ప్రభావం కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలపై బలంగా ఉంటుందని తెలిపారు. ఇక, బురేవి తుపాన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాకారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తుపాన్‌ను ఎదుర్కొవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వివరించినట్టు కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు.

    బుధవారం సాయంత్రం వరకు 2,500 వరకు పునరావస శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇప్పటికే 700 మందిని సహాయక కేంద్రాలకు తరలించినట్టు సీఎం విజయన్ తెలిపారు. మత్స్యకారులు శనివారం సాయంత్రం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 8 బృందాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సులూర్ స్థావరంలో వైమానిక దళం సౌకర్యాలు ఏర్పాటు చేశారని.. నేవీ కూడా సిద్దంగా ఉందని అన్నారు.

    ఇక, బురేవి తుపాన్ ప్రభావంతో తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బురేవి తుపాన్ తొలుత పాంబన్‌-కన్యాకుమారి మధ్య తీరాన్ని దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపారు. దీంతో పాంబన్ ప్రాంతంలోని ప్రజలను రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. అలాగే తమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో 18 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, పుదుచ్చేరి ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. అయితే కన్యాకుమారిలో వేటకు వెళ్లిన 161 మత్స్యకారులు పడవలు ఇంకా వారి ఇళ్లకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బురేవి ప్రభావం కొంతమేర ఆంధ్రప్రదేశ్‌పై కూడా పడనుంది. తుపాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: