హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం.. చుట్టూ చక్కర్లుకొట్టిన వ్యక్తి.. ఏపీ ఎంపీ పీఏనట..!

Amit Shah: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం.. చుట్టూ చక్కర్లుకొట్టిన వ్యక్తి.. ఏపీ ఎంపీ పీఏనట..!

హోంమంత్రి అమిత్ షా

హోంమంత్రి అమిత్ షా

Amit Shah Security Breach: విచారణలో తాను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీ అనుచరుడినని చెప్పాడట. ఐతే ఏ ఎంపీ పేరు చెప్పాడన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రధాని, హోంమంత్రి వంటి హై ప్రొఫైల్ కలిగిన నేతలకు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చుట్టూ కేంద్ర బలగాలు పహారా కాస్తుంటాయి. అనుమతి లేనిదే ఎవరినీ కూడా.. వారి దరిదాపుల్లోకి కూడా పంపించరు. అంత పకడ్బందీగా బందోబస్తు ఉంటుంది. కానీ కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. ఇటీవల హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర రాజధాని ముంబైలో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం లాల్ బాగ్చా రాజా గణేశుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నివాసాలకు వెళ్లి.. వారితో భేటీ అయ్యారు. ఐతే ఈ పర్యటనలో భద్రతా వైఫల్యం బయపడినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు. హోంశాఖ అధికారినని చెప్పుకొని...ఓ వ్యక్తి అమిత్ షా చుట్టూ తిరిగారు. అతడిని వెంటనే అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

  అమిత్ షా హాజరైన కార్యక్రమంలో ఆ వ్యక్తి అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. మెడలో హోంమంత్రిత్వ ఐడీ కార్డు కూడా ఉంది. అక్కడున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి సైతం అతడిపై ఎలాంటి అనుమానం రాలేదు. కానీ రెండు గంటల పాటు తిరిగిన తర్వాత.. భద్రతా సిబ్బందికి ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతడిని పేరు హేమంత్ పవార్‌గా పోలీసులు గుర్తించారు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసులు విచారణలో తేలింది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లా వచ్చాడన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. విచారణలో తాను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీ అనుచరుడినని చెప్పాడట. ఐతే ఏ ఎంపీ పేరు చెప్పాడన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

  నిందితుడు హేమంత్ పవార్ స్వస్థలం మహారాష్ట్రలోని ధూలే. అదే రోజు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం నివాసాల ముందు కూడా కనిపించినట్లు విచారణలో తేలింది. ఐతే అతడు ఎందుకోసం వచ్చాడు? హోంశాఖ ఐడీ కార్డు ఎలా వచ్చింది? అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అంశాన్ని అమిత్ షాకు భద్రతను కల్పించే సీఆర్‌పీఎఫ్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీస్ విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించింది. అమిత్ షాకు దగ్గరగా ఎవరినీ రానీయవద్దని చెప్పామని..ఐనప్పటికీ ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హేమంత్ పవార్ ఎందుకిలా చేశాడు? ఏపీకి చెందిన ఏ ఎంపీ వద్ద అతడు పనిచేస్తున్నాడు? అనే వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Maharashtra, Mumbai

  ఉత్తమ కథలు