news18-telugu
Updated: July 24, 2018, 12:46 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మూకదాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినడం మానేస్తే.. నేరాలు కంట్రోల్ అవుతాయన్నారు. మనిషిలోని సాతాను వల్లే.. ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ నేత అభిప్రాయపడ్డారు. గోమాంసం తినడం మానేస్తే.. సాతానులాంటి హింసాప్రవృత్తి నాశనం అవుతుందన్నారు. జార్ఖండ్‌లో హిందూ జాగరణ్ మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో గోవధను ఏ మతం కూడా ప్రోత్సహించదని చెప్పారు. చట్టం, ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతాయని.. ప్రజలు కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు కొంచెం ‘సంస్కారం’ అలవరుచుకోవాలని ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే దాడులు అనేవి ఎప్పుడూ సరికాదన్న ఇంద్రేష్... ఎదుటివారి సెంటిమెంట్‌ను భంగపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు.
దేశవ్యాప్తంగా మూకదాడులు పెరిగిపోతున్నాయి. గత శుక్రవారం రాజస్థాన్‌లోని అల్వర్‌లో ఓ వ్యక్తిని కొట్టి చంపారు. హర్యానాకు చెందిన రక్బర్ ఖాన్ అనే డైరీ ఫాం వ్యాపారి గోవులను తరలిస్తుండగా, అతడి మీద ఏడుగురు దాడి చేశారు. ఆ దాడిలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో వైపు పిల్లలను ఎత్తుకుపోతున్నారనే పుకార్లను నమ్మి అమాయకుల మీద ప్రజలు దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 24, 2018, 12:46 PM IST