KK Shailaja Rejects Ramon Magsaysay Award : కేరళ(Kerala) మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజ(KK Sailaja) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైద్య సేవల నిర్వహణలో సేవలకు మెచ్చి లభించిన ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డును(Ramon Magsaysay Award) తిరస్కరిస్తున్నట్లు కేకే శైలజ ప్రకటించారు. 1957లో స్థాపించిన రామన్ మెగసెసే అవార్డు ఆసియా అత్యున్నత పురస్కారం. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఈ అవార్డు అందిస్తుంటారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన రాక్ ఫెల్లర్ బ్రదర్స్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇంత గొప్ప పురస్కారం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ కేకే శైలజ మాత్రం సున్నితంగా తిరస్కరించారు.
2016 నుంచి 2021 వరకు నిపా, కోవిడ్-19కి వ్యతిరేకంగా కేరళ రాష్ట్రం చేసిన పోరాటంలో అప్పటి శైలజ కేరళ ఆరోగ్య మంత్రిగా శైలజ పనితీరు అందరి ప్రశంసలు పొందింది. ఆమె పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసింది అవార్డు కమిటీ. శైలజ పేరును అంతర్జాతీయ గౌరవానికి అవార్డ్ ఫౌండేషన్ ఖరారు చేసిందని, అయితే ఈ అవార్డును స్వీకరించవద్దని సీపీఐ(ఎం) ఆమెను కోరిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో శైలజ మాట్లాడుతూ..ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరత్వానికి పాల్పడిన దివంగత అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ అవార్డును స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్టు' తెలిపారు.
తాళం వేసి గొళ్లెం మరవడం అంటే ఇదే : లండన్ లో కారు మాయం..పాక్ లో ప్రత్యక్షం
శైలజ మాట్లాడుతూ..."నాకు మెగసెసే అవార్డు కమిటీ నుంచి లేఖ అందింది. సీపీఎం కేంద్ర కమిటీ, మా పార్టీ రాస్ట్ర నాయకత్వంతో చర్చించాను. మేము అంతా కలిసి ఆ అవార్డును అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాము. ఎన్జీఓలు కమ్యూనిస్టు భావజాలానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ నేను ఈ అవార్డును ఓ వ్యక్తిగా స్వీకరించడం సరైంది కాదు. ఎందుకంటే నిజానికి ఈ అవార్డు సమష్టి కృషి ఫలితంగా వచ్చింది. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం- కేరళ ఆరోగ్యశాఖ సమష్టి కృషి ఫలితంగా లభించిన ఈ పురస్కారాన్ని వ్యక్తిగత హోదాలో స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు.ఇప్పటివరకు రామన్ మెగసెసే పురస్కారం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఏ ఒక్క నేతకూ లభించలేదు " అని తెలిపారు. ఇది మొత్తం రాష్ట్రానికి లభించిన గౌరవాన్ని నిరాకరిస్తున్నట్లుగా చూడకూడదని శైలజ అన్నారు.
రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ ఏడో అధ్యక్షుడు. ఆ దేశంలో కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. 1950లలో ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టుల (హక్బలాహప్, సెంట్రల్ లుజోన్ రైతులు ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ గెరిల్లా ఉద్యమం) ఉద్యమాలను అణచివేసిన చరిత్ర మెగసెసేది అంటూ పలువురు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.