Coronavirus Vaccination: భారతీయులు గర్వంగా తలెత్తుకునే రోజు ఇది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... 10.30కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ICDS సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది.
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తక్కువ సమయంలోనే 2 వ్యాక్సిన్లు వచ్చాయన్న ఆయన... శాస్త్రవేత్తలు పండుగలు జరుపుకోలేదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మరిన్ని వ్యాక్సిన్లు తయారవుతున్నాయన్న ఆయన... ముందుగా డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది... ఆ తర్వాత సఫాయీ కర్మచారీ వారికి వ్యాక్సిన్లు వేస్తామన్నారు. తర్వాత సైనికులకు మిగిలిన వ్యాక్సిన్లు వేస్తామన్నారు. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నామన్న ప్రధాని... వ్యాక్సిన్ వేసేందుకు కోవిన్ పోర్టల్ రూపొందించినట్లు తెలిపారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ నిర్భరంతో మనం కరోనాతో పోరాడుతున్నామన్న ప్రధాని మోదీ... మన కాన్ఫిడెన్స్‌ని కరోనా దెబ్బతీయలేదని అన్నారు.
తెలంగాణలో 139 కేంద్రాల్లో సుమారు 4వేల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వారంలో 4 రోజుల పాటు ఈ ప్రక్రియ ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా 1,213 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. మొదటి విడతగా నేటి నుంచి 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని 13 సెంటర్లలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. మొదటి ప్రాధాన్యంగా నేడు ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నిమ్స్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి... విజయవాడలోని GGHలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. సుమారు 2 వేల మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నా3రు. తొలి విడతలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే 4.77 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవ్యాక్సిన్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి.
ఇండియాలో కరోనా కేసులు అప్డేట్:
ఇండియాలో నిన్న 15,158 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.05 కోట్లకు చేరింది. నిన్న కొత్తగా 175 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1.52 లక్షలు దాటింది. ప్రస్తుతం మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. ఇండియాలో నిన్న కొత్తగా 16,977 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1.01 కోట్లు దాటింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.6 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,11,033గా ఉంది. దేశంలో నిన్న 8,03,090 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 18.57 కోట్లు దాటింది.
ఇది కూడా చదవండి: Elaichi Health Benefits: యాలకులతో ఆస్తమాకు చెక్... ఇలా చెయ్యండి
వ్యాక్సిన్ ఇచ్చేసినంత మాత్రాన కరోనా వైరస్ సోకదని గ్యారెంటీ లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎందుకీ వ్యాక్సిన్ అంటే... వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకినా... అది ప్రాణాలు తీసేంత స్థాయికి చేరదు అని చెబుతున్నారు. అందువల్ల వ్యాక్సిన్ వేయించుకున్నవారు సైతం... ఇప్పటిలాగే... కరోనా జాగ్రత్తలన్నీ పాటించాలని సూచిస్తున్నారు.