Covid Cases: కరోనా మహమ్మారి(Covid pandamic) మరోసారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో కొత్త కేసుల నమోదులో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ కేసులు(Covid cases) వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3095 కేసులు నమోదయ్యాయి. గత ఆరునెలల తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15028 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. టెస్ట్‌లు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతికదూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని కేంద్రం సూచించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర , ఢిల్లీలలో ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటివరకు XBB వేరియంట్, దాని సబ్ వేరియంట్ కేసులు మాత్రమే నమోదువుతున్నట్లు, కొత్త వేరియంట్ పుట్టుకురాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
* మహారాష్ట్ర
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 694 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,000 మార్కును ధాటింది. ప్రధానంగా షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. వరుసగా 20.05, 17.47 శాతంతో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ముంబై, పూణే, థానే, రాయ్‌గఢ్, నాసిక్, సాంగ్లీ వంటి జిల్లాల్లో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
* ఉత్తరప్రదేశ్
యూపీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గౌతమ్‌బుద్ధ నగర్, ఘజియాబాద్, లఖింపూర్ ఖేరీ జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ సిబ్బందిని అలర్ట్ చేసింది. అయితే గడిచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం గమనార్హం. కేవలం 17 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
* కేరళ
కేరళలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 654 కేసులు నమోదు కాగా, ముగ్గురు వైరస్ కారణంగా చనిపోయారు. ప్రధానంగా ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోందని, జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ పంపుతున్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
News18 కృషిని అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
* గోవా
పర్యాటక రాష్ట్రం గోవాలో గడిచిన 24 గంటల్లో తాజాగా 108 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు వైరస్ కారణంగా మరణించారు. ఇక బుధవారం నాడు కొత్తగా 97 కేసులు నమోదు అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 295 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 932కు చేరింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వల్పంగానే కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 17 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 155కు చేరాయి. ఏపీలో తాజాగా 6 కేసులు మాత్రమే నమోదు కాగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 71కి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Covid -19 pandemic