రేపటి నుంచి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు.. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం ఉపవాస దీక్షపై(రోజా) ఎలాంటి ప్రభావం చూపబోదని ప్రముఖ ఇస్లామిక్ సంస్థ మంగళవారం తెలిపింది. రంజాన్ పవిత్ర మాసంలో రోజా పాటించే ముస్లింలు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండవద్దని పేర్కొంది. వ్యాక్సిన్ నేరుగా రక్తనాళాల్లో కలుస్తుందని, పొట్టలోకి వెళ్లదు కాబట్టి రోజా భంగం కాదని తెలిపింది. ఈ మేరకు దారుల్ ఇఫ్తా ఫరంగి మహల్(Darul Ifta Farangi Mahal)ఫత్వా జారీ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ రషీద్ కిడ్వాయి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఫత్వా జారీ అయింది.
‘నేను ఇదివరకే కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ఇప్పుడు రంజాన్ మాసంలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. మరీ ఇప్పుడు రంజాన్ మాసంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవచ్చా’ అని అబ్దుల్ రషీద్ కిడ్వాయి అడిగారు. దీనికి సమధానంగా ఫత్వా జారీ అయింది. ఈ ఫత్వాపై ముస్లిం పెద్దలు మౌలాన్ ఖాలిద్ రషీ ఫరంగి మహలి, మౌలానా నస్రుల్లా, మౌలానా నయెముర్ రెహ్మాన్ సిద్ధిఖి, మౌలానా ముస్తాక్ తదితరుల సంతకాలు ఉన్నాయి.
ఇక, భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,61,736 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. కరోనా మరణాలు కూడా భారత్‌ను కలవరపెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా సోకిన వారిలో 879 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా వల్ల 1,71,058 మంది చనిపోయారు. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,64,698.
మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. అవసరమైతే మరిన్ని టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తుంది. భద్రత ఆధారంగా వాటిని అనుమతులు ఇవ్వనున్నారు. అయితే మరోవైపు అర్హులందరికి కరోనా టీకా అందించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.