కరోనా మహమ్మారి (Corona) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలపై ప్రభావం (Effect) చూపించింది. ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో ఎందరో సతమతమ్యారు. అలాగే ఈ మహమ్మారి ఎఫెక్ట్ చిన్నారులపైనా ఎక్కువగానే పడింది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలోనే ఒంటరిగా గడపడం వల్ల మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. అలాగే కొందరు పిల్లల్లో మాటలు రావడం కూడా ఆలస్యమవుతోంది. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం వల్ల వారు మాట్లాడడంలో ఇబ్బంది పడుతున్నారని కొన్ని సర్వేలు కూడా తెలిపాయి. లాక్‌డౌన్‌లో పుట్టిన చిన్నారులు, అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తాయి.
చిన్నారులు చుట్టూ సమాజం నుంచి భాషకు సంబంధించిన నాలెడ్జ్‌ను సహజంగా పొందుతారని భాషా నిపుణులు చెప్తున్నారు. అయితే పిల్లలు ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల మాటలు నేర్చుకోవడం ఆలస్యమవుతోందని పేర్కొంటున్నారు. ఐదు ఆరేళ్ల వయసు్సన్న పిల్లల్లో స్పీచ్, లాంగ్వేజ్ సపోర్ట్ కోసం వచ్చే వారి శాతం పెరుగుతోందని సర్వే నివేదికలు పేర్కొన్నాయి.
* మాటలు రావడం ఆలస్యం
ప్రతి వారం దాదాపు 15 మంది పిల్లలు స్పీచ్ థెరపీ కోసం తన దగ్గరికి వస్తున్నారని చెప్పారు ఢిల్లీ అపోలో హాస్పిటల్‌లో ఆడియాలజిస్ట్‌గా పనిచేస్తున్న నివేథా నారాయణ్. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఇంతకుముందు ఆ సంఖ్య కేవలం ఐదు మాత్రమే ఉండేదని వెల్లడించారు. భాష, కమ్యూనికేషన్ కోసం మెదడులో నిర్దిష్టమైన ప్రాంతాలు ఉంటాయి.
పిల్లలు పెరుగుతున్నప్పుడు సమాజంతో మంచి ఇంటరాక్షన్, స్టిమ్యులేషన్స్ వల్ల న్యూరల్ నెట్‌వర్క్ అభివృద్ధి చెందుతుంది. భాషాభివృద్ధికి బాల్యంలోని మొదటి ఏడు సంవత్సరాలు చాలా ముఖ్యం. అందులోనూ 0-2 సంవత్సరాలు మరింత కీలకం. ఈ సమయంలో చిన్నారి మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుందని నివేథా తెలిపారు.
* కారణాలు ఏంటి?
ఆడుకునే ప్రాంతాలు, ప్రీ స్కూల్స్, డేకేర్ సెంటర్‌లను కరోనా లాక్‌డౌన్‌లో చాలా కాలం మూసేయడం వల్ల ఇతర పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు కోల్పోయారు. దీంతో లాక్‌డౌన్ సమయంలో పిల్లలు సామాజిక, భాషా అభివృద్ధి విషయంలో చాలా మంది వెనుకబడ్డారు. చిన్నారులు సమాజంతో కలిసే అవకాశాలు తగ్గడంతో వారి పరిణితిపై ప్రభావం పడింది.
ఒంటరితనం, నిద్రలేమి, ఒత్తిడి, స్కూల్స్ లేకపోవడం వంటి కారణాలతో చిన్నారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కూళ్లు కేవలం చదువు కోసం మాత్రమే కాకుండా పిల్లలు మానసికంగా ఎదగడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇతర చిన్నారులతో కలిసి గడిపితేనే వారిలో వివిధ అంశాలు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి : మీ వంటింటిలో ఇది ఒకటి ఉంటే చాలు.. చలికాలంలో అన్ని జబ్బులు ఫసక్కే!
లాక్‌డౌన్, క్వారంటైన్ సమయాల్లో తోబుట్టువులు లేని పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం, టూ వే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పిల్లలు బాగా నష్టపోయారు. కొంతమంది పిల్లలు అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్ బారిన పడ్డారని, కొందరు ఆటిజం, మరికొంతమంది డిస్‌ఫ్లూయన్సీలతో ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు.
* పరిష్కార మార్గాలు
కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చిన్నారుల రోజువారీ దినచర్యకు ఆటంకం ఏర్పడిందని, ఈ ప్రతికూల ప్రభావం కారణంగా సామాజిక, భాషా నైపుణ్యాలు సరిగ్గా నేర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని బెంగళూరు నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్‌లోని చైల్డ్ అండోల్సెంట్ సైక్రియాట్రీ విభాగం ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ జాన్ విజయ్ సాగర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తెలిపారు.
పిల్లల్లో భాషా నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు చిన్నప్పటి నుంచి మంచి పుస్తకాలను వారికి పరిచయం చేయాలి. జంతువుల మినియేటర్, పప్పెట్స్ సహాయంతో కథలు చెప్పిస్తూ మాట్లాడించేందుకు ప్రయత్నించాలి. నర్సరీ రైమ్స్‌ను యాక్షన్ చేస్తూ పాడిస్తుండాలి. బొమ్మ ఫోన్‌లో మాట్లాడిస్తూ ఆడించాలి. ఇలా పిల్లలకు తగిన సమయం కేటాయించి వారు సమస్యలను అధిగమించేలా ప్రయత్నం చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Corona, Covid -19 pandemic, National News