దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభావ వంతమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సోమవారం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ‘కోవిడ్ కేసులు ఉప్పెనలా పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా, నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిగణలోకి తీసుకోవాలి’అని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంటెన్సివ్, లోకల్, ఫోకస్డ్ కంటైన్‌మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను అమలు చేయాలని సూచించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. పరిస్థితులను అంచనా వేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించే ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. జిల్లా, నగరం, వార్డు స్థాయిలో స్థానికంగా ఆంక్షలు విధించవచ్చని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియత్రంణ కోసం ప్రత్యేకించిన జిల్లాలు, నగరాలు, వార్డుల వారీగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా అధికారులు జారీచేసిన ఆదేశాలు విస్తృతంగా అమలు అయ్యేలా, ప్రజలు పాటించేలా చూడాలని కోరారు.
ఇక, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో. మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరింది. కొత్తగా 2,812 మంది చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,95,123కి చేరింది. తాజాగా 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,43,04,382కి చేరింది. రికవరీ రేటు 83.5 శాతం నుంచి తగ్గి... 82.6 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Union Home Ministry