అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరు జైళ్లో ఉంటున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళకు భారీ ఊరట. ఆమె మేనల్లుడు, ముఖ్య అనుచరుడైన సుధాకరన్ ను విడుదల చేయడానికి కోర్టు అంగీకారం తెలిపింది. నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న ఆయన త్వరలోనే బయటకు రానున్నారు. ఆయన జైలుశిక్ష ఇటీవలే ముగిసింది. అంతేగాక.. ఆయనకు విధించిన దానికంటే ఎక్కువరోజులే ఆయన శిక్షను అనుభవించాడని ఆయన తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని వాళ్లు స్థానికంగా ఉన్న సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుధాకరన్.. ఆయనకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష కంటే ఎక్కువ కాలం జైళ్లో ఉండటమే గాక.. కోర్టు విధించిన రూ. 10 లక్షల 10 వేల జరిమానాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణతో శశికళ మేనల్లుడు సుధాకరన్ పై 1997 లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన 7 రోజులు జైళ్లో ఉండగా.. 2001 లో 92 రోజులు ఒకసారి.. అదే ఏడాదిలో విచారణ జరిగిన కాలంలో 24 రోజులు మరోసారి కోర్టులో ఉన్నారు. ఈ కేసులో ఆయన నేరం రుజువైన తర్వాత.. 2017 జూన్ 15 నుంచి ఆయన బెంగళూరు జైళ్లోనే ఉంటున్నారు. దీంతో గతంలో ఆయన జైళ్లో ఉన్న నాలుగు నెలలతో కలుపుకుని.. ఆయన కారాగార శిక్ష పూర్తైందని వారు కోర్టుకు తెలిపారు.
అంతేగాక ఈ కేసులో కోర్టు విధించిన రూ. 10 లక్షల రూపాయలను కూడా చెల్లించడానికి ఆయన సిద్దంగా ఉన్నారని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎప్పుడైనా విడుదల చేయొచ్చని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి కోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే.. సుధాకరన్ ను విడుదల చేసేందుకు జైలు అధికారులు సిద్దమవుతున్నారు. వచ్చే వారం ఆయన జైలు నుంచి విడుదల కానున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Jayalalitha, Karnataka, Sasikala, Tamilnadu