మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించాలా, వద్దా అనే అంశంపై ఫైనల్ నిర్ణయం స్పీకర్దేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి అధికారం స్పీకర్‌కి ఉందనీ, నిర్ణయం తీసుకోవడానికి టైమ్ లిమిట్ లేదని తెలిపింది. అలాగని బలపరీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని వాళ్లను బలవంతం చేసే పరిస్థితి ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల గురువారం బల పరీక్ష ఉంటే, అందులో పాల్గొనాలో, లేదో రెబెల్ ఎమ్మెల్యేలు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం సుప్రీంకోర్టుకు వెళ్లటం... ప్రభుత్వం, రెబల్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించడంతో... సుప్రీంకోర్టు తాజాగా చెప్పిన తీర్పు... సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది.
మ రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఆమోదించేలా ఆదేశించాలని కాంగ్రెస్, జేడీఎస్ నుంచీ 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. వారి రాజీనామా లేఖలు సరైన ఫార్మాట్లో ఇవ్వలేదనీ, కాబట్టి స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోకుండా... యదాతథ స్థితి కొనసాగించాలని కర్నాటక ప్రభుత్వం కోరింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది.
గురువారం బలపరీక్ష ఉంటుందా? : సుప్రీంకోర్టు తీర్పు కారణంగా... గురువారం కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఉండకపోవచ్చని తెలుస్తోంది. 18న ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ మొదట నిర్ణయించారు. సీఎం కుమారస్వామి ప్రభుత్వంపై ఈ నెల 15న స్పీకర్‌కు బీజేపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వడంతో... ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అధికార పక్షం ఇచ్చిన విశ్వాస తీర్మానం కూడా స్పీకర్ దగ్గర ఉంది. కాంగ్రెస్-జేడీఎస్‌లకు చెందిన 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా... వారి రాజీనామా పత్రాలు స్పీకర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో... ఇప్పట్లో స్పీకర్... రాజీనామాలను ఆమోదించకపోయినా, అడిగే వాళ్లు లేరు. అందువల్ల ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నుంచీ గట్టెక్కినట్లే.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.