Covid Vaccine: దాదాపు 10 నెలల ఎదురు చూపుల తర్వాత... ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలవ్వబోతోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ - DCGI... ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ (Covishield) (దీన్ని ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా - SII ఉత్పత్తి చేస్తోంది), హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ (Covaxin)కి ఆమోదం తెలపడంతో... దేశంలోని అన్ని రాష్ట్రాలూ వ్యాక్సిన్ పంపిణీ, టీకాలు వేసేందుకు రెడీ అయ్యాయి. ఆల్రెడీ వ్యాక్సిన్ డ్రై రన్ కూడా పూర్తి చేశాయి. ఇక ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. కేంద్రం కొనుగోలు ఆర్డర్ ఇవ్వగానే... భారత్ బయోటెక్, SII వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తాయి. జనవరి 13 లేదా 14 నుంచి టీకాలు వేసే కార్యక్రమం మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పై రెండు వ్యాక్సిన్లకూ పూర్తి స్థాయి అనుమతులు లభించలేదు. ఎమర్జెన్సీ కోసం మాత్రమే వాడాలని అనుమతి ఇచ్చారు. అందువల్ల కరోనా ఉన్న అందరికీ వీటిని ఇవ్వరు. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, డాక్టర్లకు ఇస్తారు. కేంద్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చిన వారం తర్వాత వ్యాక్సిన్లు పంపిణీ చేయగలమని SII సీఈఓ ఆదార్ పూనవల్లా తెలిపారు. కేంద్రం ఆమోదం తెలపగానే... 10 రోజుల్లో టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ జనవరి 3న తెలిపారు. తొలిదఫా ఇచ్చే వ్యాక్సిన్లను ముందుగా హెల్త్ కేర్ వర్కర్లు, ఎమర్జెన్సీ సర్వీస్ ఉద్యోగులు, ముసలివారికి ఇవ్వనున్నారు.
ఇదీ జరిగే ప్రక్రియ:
రాజేష్ భూషణ్ ప్రకారం... కేంద్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చాక... వ్యాక్సిన్ తయారీ కంపెనీలు... వ్యాక్సిన్లను ముంబై, చెన్నై, కోల్కతా, కర్నాల్, హర్యానాలోని ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపార్ట్మెంట్ డిపోలకు చేర్చుతారు. ఇందుకోసం విమానాలను ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆ వ్యాక్సిన్లు 37 రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ల స్టోర్లకు వెళ్తాయి. అక్కడి నుంచి జిల్లాల వ్యాక్సిన్ స్టోర్లకు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తాయి. అక్కడ వ్యాక్సిన్ వేస్తారు. ఇండియాలో వ్యాక్సిన్లను సేఫ్గా స్టోర్ చెయ్యడానికి 29,000 కోల్డ్ చైన్ పాయింట్లను సిద్ధం చేశారని రాజేష్ భూషణ్ తెలిపారు.
వ్యాక్సిన్ల సమర్థతపై పెద్ద దుమారం రేగుతుండటంతో... భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ మాటపైకి వచ్చాయి. రెండూ కలిసి పనిచేసి... వ్యాక్సిన్లను ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తామని తెలిపాయి. "వ్యాక్సిన్లు ఎంత అవసరమో మాకు తెలుసు. మేం కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం" అని వారు ప్రకటించారు.
భారత్ బయోటెక్... తన ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేసినట్లు తెలిపింది. త్వరలోనే తమ రిపోర్టును సమర్పిస్తామని వివరించింది. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వచ్చే 3 లేదా 4 నెలల్లో వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులు కోరతామని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
కొవిడ్ హాస్పిటల్ పరిసరాల్లోని గాలిలో కరోనా వైరస్ ఉండే అవకాశం ఉందని సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) తెలిపింది. అలాంటి చోట్లకు వెళితే వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ ఈ అంశంపై 3 నెలలుగా అధ్యయనం చేస్తోంది. ఆ రిపోర్టును మంగళవారం బయటపెట్టింది. కరోనా ఆస్పత్రుల ఆవరణలోనూ వైరస్ ఉంటుందని తెలిపింది. కొవిడ్ రోగుల సంఖ్య, వారు ఉండే సమయం ఆధారంగా గాలిలో వైరస్ ప్రభావం ఉంటుందని తెలిపింది. మూసిఉన్న గదుల్లో (ఏసీ గదులు, ICUలు) కొన్ని గంటల తర్వాత కూడా కరోనా వైరస్ యాక్టివ్గా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇలాంటి గదుల్లో 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్ వ్యాపిస్తుందని తెలిసింది.
జులై 2021 నాటికి దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సరిపడా డోసులు ఉంటాయని ఆశిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు, కేంద్ర కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఎవరు ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్నది ప్రజల ఇష్టం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Indian Railways: సంక్రాంతి కోసం సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్.. పూర్తి వివరాలు
ప్రస్తుతం దేశంలో 30 వ్యాక్సిన్లు తయారవుతున్నాయనీ... అవన్నీ వివిద దశల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్దన్ తెలిపారు. మూడు వ్యాక్సిన్లు... మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాయని వివరించారు. వాటిలో 2 వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ వాడకం కోసం ఆమోదించినట్లు తెలిపారు.