హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Curfew: ఢిల్లీలో కర్ఫ్యూ.. శని, ఆదివారం అన్నీ బంద్.. సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన

Delhi Curfew: ఢిల్లీలో కర్ఫ్యూ.. శని, ఆదివారం అన్నీ బంద్.. సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

Weekend Curfew in Delhi: ఢిల్లీలో కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వీకెండ్ కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రకటించారు.

  ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. అంతేకాదు ఢిల్లీ వ్యాప్తంగా మాల్స్, జిమ్స్, ఆడిటోరియమ్స్, స్పా సెంటర్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. సినిమా థియేటర్లలలో 30శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. హోటల్స్‌లో డైన్ ఇన్‌కు అనుమతి లేదు. కేవలం పికప్, హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

  ''ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఢిల్లీలో వారాంతపు రోజుల్లో కర్ఫ్యూ విధిస్తాం. ఈ వీకెండ్ కర్ఫ్యూ కరోనా చైన్‌ను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నాం. ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత లేదు. ప్రస్తుతం 5వేల బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి.'' అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

  ఢిల్లీలో ఆంక్షలు ఇవే:

  ప్రతి శనివారం, ఆదివారం పూర్తి స్థాయిలో కర్ఫ్యూ

  శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 వరకు కర్ఫ్యూ

  కర్ఫ్యూ సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు

  అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు

  కర్ఫ్యూ రోజుల్లో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు ప్రత్యేక పాస్‌లు జారీ

  ఒక మున్సిపల్ జోన్ పరిధిలో ఒకే వారాంతపు సంత

  30శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లకు అనుమతి

  స్పాలు, మాల్స్, ఆడిటోరియమ్‌లు, జిమ్‌లు బంద్


  ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 17282 కొత్త కేసులు నమోదయ్యాయి. 9952 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. మరో 104 మంది ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 7,67,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా నుంచి 7,05,162 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 11,540 మంది మరణించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Arvind Kejriwal, Coronavirus, Delhi, Lock down

  ఉత్తమ కథలు