Coronavirus: భారతీయుల కోసం చైనాకు స్పెషల్ ఫ్లైట్.. 24X7 హెల్ప్‌లైన్‌

Coronavirus: కరోనా వైరస్‌పై 24*7 స్పెషల్ హెల్ప్ లైన్ (011-23978046)ను కేంద్రం ఏర్పాటుచేసింది. ఏ మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించినా వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించింది.


Updated: January 28, 2020, 5:56 PM IST
Coronavirus: భారతీయుల కోసం చైనాకు స్పెషల్ ఫ్లైట్.. 24X7 హెల్ప్‌లైన్‌
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్..! చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో ఇప్పటికే 100 మందికిపైగా చనిపోవడంతో మిగతా దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా మనకు పక్కనే ఉండడం, చాలా మంది భారతీయులు చైనా రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ భారత్‌కు వ్యాపించే అవకాశముంది. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం.. ఇప్పటికే అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ లుఏర్పాటుచేసి చైనా నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా వైరస్‌పై 24*7 స్పెషల్ హెల్ప్ లైన్ (011-23978046)ను కేంద్రం ఏర్పాటుచేసింది. ఏ మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించినా వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించింది. కరోనా వైరస్‌కు సంబంధించి అన్ని వివరాలనూ ఈ హెల్ప్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.

వూహన్ సిటీలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నగరంలోనే కరోనా వైరస్ పుట్టినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వూహన్ సిటీని అష్టదిగ్బంధనం చేశారు. నగరంలోకి నుంచి ఎవరినీ బయటకు రానీయడం లేదు. కొత్తగా లోపలికి ఎవరినీ వెళ్లనీయడం లేదు. వూహన్ నగరంలో భారతీయులు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే వారిని భారత్ రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ముంబై నుంచి 423 సీట్ల సామర్ధ్యమున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వూహన్‌లో భారతీయులందరినీ ఈ విమానం ద్వారా భారత్‌కు తీసుకురానున్నారు. చైనా అధికారులతో భారత ఎంబసీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. వూహన్‌లో 250-300 మంది భారత విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటికే 106 మంది చనిపోయారు. మరో 1300 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ, శ్రీలంక, కెనడా సహా చాలా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో చైనా నుంచి భారత్‌కు వచ్చే విమానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. థెర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 450 మందిని అబ్జర్వేషన్‌లో ఉన్నప్పటికీ ఏ ఒక్కరిలోనూ కరోనా లక్షణాలు బయటపడలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ మంది కేరళీయులే ఉన్నారని తెలిపారు. ఇక ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, పట్నాలోను కరోనా వైరస్‌ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందాలు వారిని పరీక్షిస్తున్నాయి. కరోనా వైరస్‌ ఉంటే దగ్గు, జ్వరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఏ మాత్రం అనుమానం ఉన్న వెంటనే ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు