Covid19: దేశంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కరోనా.. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, రెమిడిసివిర్ వంటి అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే కరోనా అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నట్లు అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు.

 • Share this:
  భారత్‌పై కోవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. కరోనా వైరస్ రూపం మార్చుకోని అల్లకల్లోలం సృష్టిస్తోంది. అమెరికా, బ్రెజిల్ కంటే తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటా స్వీకరించింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా తయారయిందని.. ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొంటోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ మహమ్మారి నియంత్రణకు జాతీయ ప్రణాళిక అవసరమని సీజేఐ జస్టిన్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మానసనం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

  దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, రెమిడిసివిర్ వంటి అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే కరోనా అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నట్లు అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

  కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయని.. దీని వల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంతో తాము విచారణకుే సిద్ధమైనట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశంలో వ్యాక్సిన్‌లు, కరోనా మందులు, ఆక్సీజన్ కొరతపై కొన్ని రోజులుగా దుమారం రేగుతోంది. కేంద్రం సరిపడా వ్యాక్సిన్‌లను, ఆక్సీజన్‌ను సరఫరా చేయడం లేదని రాష్ట్రాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. నేషనల్ ప్లాన్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక మినీ లాక్‌డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. యూపీలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై స్టే విధించిన కొన్నిరోజుల్లోనే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

  కాగా, మన దేశంలో గడిచిన 24 గంటల్లో 3,14,835 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 1,78,841 మంది కోలుకోగా.. 2014 మంది చనిపోయారు. వరుసగా రెండో రోజు.. 2వేల మందికి పైగా మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965కి చేరింది. వీరిలో 1,34,54,880 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,84,657 మంది మరణించారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 67,468 కొత్త కేసులు నమోదయ్యాయి. యూపీలో 33,106, ఢిల్లీలో 24,638, కర్నాటకలో 23,558, కేరళలో 22,414, రాజస్థాన్‌లో 14,622, ఛత్తీస్‌గఢ్‌లో 14,519, మధ్యప్రదేశ్‌లో 13,107, గుజరాత్‌లో 12,553 కేసులు వచ్చాయి
  Published by:Shiva Kumar Addula
  First published: