మన దేశంలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. అక్కడక్కడా కొన్ని కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు కేవలం వెయ్యి కరోనా కేసులు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల కూడా కరోనా ఆంక్షలను సడలించాయి. అంతటా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు మాస్క్‌లు లేకుండానే బయట తిరుగుతున్నారు. ఐతే కరోనా ప్రమాదం ఇంకా ముగియలేదు. చైనా సహా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి పెరిగింది. పలు దేశాలను వణికిస్తున్న కరోనా ఎక్స్ఈ వేరియెంట్ మనదేశానికి కూడా పాకింది. ముంబైలో తొలి కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మళ్లీ ముందస్తు చర్యలు చేపట్టింది. 18ఏళ్లు నిండిన అందరికీ మూడవ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి అందరూ బూస్టర్ డోస్ పొందవచ్చని తెలిపింది.
ఐతే మూడో డోస్‌ను కూడా కేంద్రం ఉచితంగానే ఇస్తుందా? బూస్టర్ డోస్‌కు ఎవరు అర్హులు? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఇక్కడ చూద్దాం.
టీకా యొక్క మూడవ డోస్ ఎవరు పొందవచ్చు?
18 ఏళ్ల వయసు పైబడి... 9 నెలల క్రితం లేదా 39 వారాల క్రితం రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారంతా మూడవ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
వ్యాక్సిన్ ఉచితంగా లభిస్తుందా?
కరోనా మొదటి రెండు డోసులను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. కానీ మూడో డోస్ మాత్రం ఫ్రీగా ఉండదు. మూడో డోసుకు ఎవరికి వారు డబ్బులు చెల్లించాల్సిందే. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో బూస్టర్ డోస్‌లు అందుబాటులో ఉంటాయి. మూడో టీకా ధరలను త్వరలోనే ప్రకటిస్తారు. ఆ వివరాలు CoWin ప్లాట్‌ఫారమ్‌లో కనిపిస్తాయి.
వ్యాక్సిన్ ధర ఎంత ?
కోవిషీల్డ్ బూస్టర్ డోస్ ధర రూ.600 ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా ఇప్పటికే తెలిపారు. దీనికి రాష్ట్రాల వారీగా పన్ను కూడా కలుపుతారు. కోవాక్సిన్ బూస్టర్ డోస్ ధరను మాత్రం భారత్ బయోటెక్ ఇంకా వెల్లడించలేదు. దీనిపై కంపెనీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
మూడో డోస్‌లో ఏ వ్యాక్సిన్ ఇస్తారు?
మొదటి రెండు డోస్‌లు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మూడో డోస్ కూడా అదే టీకా తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోస్‌లు కొవాగ్జిన్ తీసుకుంటే.. కోవాగ్జిన్ తీసుకోవాలి. కోవిషీల్డ్ తీసుకుంటే.. ఇప్పుడు కూడా కోవిషీల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది.
మూడవ డోస్‌కు అర్హుడినా? కాదా ? ఎలా తెలుస్తుంది?
అవును. కో-విన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజలకు SMS పంపిస్తారు. మీరు 9 నెలల క్రితం వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే. . మూడో డోస్‌కు అర్హులని సందేశం కనిపిస్తుంది.
నేరుగా టీకా కేంద్రాన్ని సందర్శించవచ్చా?
అవును. ఇంతకుముందులానే రిజిస్ట్రేషన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. కాబట్టి CoWinలో అయినా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే నేరుగా ప్రైవేట్ ఇమ్యునైజేషన్ సెంటర్‌కి వెళ్లి కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రేపటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.