Amit Shah: సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడ్డాక జరగనున్న మెగా సదస్సుకు కేంద్ర మంత్రి అమిత్ షా

అమిత్ షా

కేంద్ర కేబినెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 25న జరగనున్న సహకార సంస్థల మెగా సదస్సులో పాల్గొననున్నారు. సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన కేంద్రం ఈ రంగ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో, ప్రభుత్వ విజన్ ఏంటనే విషయాలను ప్రధానంగా అమిత్ షా వెల్లడించనున్నారు.

  • Share this:
    న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 25న జరగనున్న సహకార సంస్థల మెగా సదస్సులో పాల్గొననున్నారు. సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన కేంద్రం ఈ రంగ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో, ప్రభుత్వ విజన్ ఏంటనే విషయాలను ప్రధానంగా అమిత్ షా వెల్లడించనున్నారు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సదస్సు జరగనుంది. సహకార సంస్థలైన ఐఎఫ్‌ఎఫ్‌సీవో, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అముల్, సహకార భారతి, ఎన్ఏఎఫ్‌ఈడీ(NAFED) తదితర సహకార సంస్థలు ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలను భుజాలకెత్తుకున్నాయి.

    దాదాపు 2వేల మందికి పైగా ఈ సదస్సులో ప్రత్యేకంగా పాలుపంచుకోనుండగా.. 8 కోట్ల మంది వర్చువల్‌గా పాల్గొంటున్నారు. 110 దేశాల్లోని 3 మిలియన్ల సహకార సంస్థలు భాగమైన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ (గ్లోబల్) సంస్థ కూడా వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొననున్నట్లు ఐఎఫ్‌ఎఫ్‌సీవో(IFFCO) తెలిపింది. అంతర్జాతీయంగా భారతీయ సహకార సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరగబోతోంది. ‘సహకార్ సే సమృద్ధి’ ఆలోచనను సాకారం చేసుకునే దిశగా.. మోదీ సర్కార్ ప్రత్యేకంగా గత జూలైలో ‘సహకార మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసింది. ఈ శాఖకు మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు.

    భారత్‌లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వీలుగా.. ఈ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక పరిపాలన, చట్టపరమైన, విధానపరమైన రూపాన్ని అందిస్తుందని కేంద్రం తెలిపింది. క్షేత్ర స్థాయిలో సహకార సంస్థలను మరింత పటిష్టం చేయడానికి ఈ మంత్రిత్వ శాఖ తన వంతు ప్రయత్నం చేస్తుందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ను నిజం చేసేందుకు ఈ సహకార శాఖ పనిచేస్తుందని ఐఎఫ్‌ఎఫ్‌సీవో(IFFCO) తెలిపింది. ఈ మంత్రి శాఖను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇంత పెద్ద సదస్సు జరగనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సహకార సంస్థలకు ‘సులభతరమైన వ్యాపారం’ కోసం ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, బహుళ-రాష్ట్ర సహకార(ఎంఎస్‌సిఎస్) సంస్థల అభివృద్ధికి శ్రీకారం చుట్టే దిశగా సహకార మంత్రిత్వ శాఖ పనిచేయనుంది.

    ఇది కూడా చదవండి: PM Modi USA Tour: అమెరికాలో ప్రధాని మోదీ బిజిబిజీ.. క్వాల్‌కామ్ సీఈవోతో భేటీ

    ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖపై సీపీఎం ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రాల హక్కులను హరించేందుకే ఈ శాఖను తీసుకొచ్చారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం సహకార సంఘాలు పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, అలాంటప్పుడు కేంద్రం ఈ శాఖను ప్రవేశపెట్టడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. సహకార బ్యాంకులను దోచుకోవడానికే కేంద్రం ఈ శాఖను ఏర్పాటు చేసిందని సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: