ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా వలస జీవులు పడుతున్నబాధలు అన్నీఇన్నీ కావు. ప్రజారవాణ పూర్తిగా స్థంభించిపోవడం.. ప్రైవేటు వాహనాలు తిరిగే పరిస్థితి లేక సొంతూళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా ఓ వలస కూలీ సొంతూరికి వెళ్లేందుకు ఏకంగా 135 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి.. కరోనా ఎఫెక్ట్‌తో కూలీలు పడుతున్న బాధలను కళ్లకు కట్టాడు. ఇందులో కోసమెరుపు ఏంటంటే.. సదరు కూలీ రెండు రోజుల పాటు కేవలం గుక్కెడు గుక్కెడు నీటితో గొంతు తడుపుకుంటూ ఇంటిబాట పట్టిన ఊదంతం కలచివేస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా జాంబ్ గ్రామానికి చెందిన నరేంద్ర షెల్కే కూలీ పనుల కోసం పూణె వెళ్లాడు. అక్కడ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించడంతో సొంతూరికి వెళ్లేందుకు బయలుదేరాడు. పూణె నుంచి నాగ్‌పూర్ వరకు రైలులో వెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు స్టేషన్ నుంచి బయటకు రాగా అప్పటికే ప్రజారవాణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రైవేటు వాహనాలు సైతం అందుబాటులో లేవు. దీంతో తన కాళ్లను నమ్ముకుని స్వగ్రామానికి బయలుదేరాడు. అలా మంగళవారం తన నడకను మొదలుపెట్టి.. కేవలం నీటితో గొంతు తడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అలా దాదాపు 135 కిలోమీటర్ల మేర బుధవారం రాత్రి దాకా నడిచాడు.
అయితే మరో 25కిలోమీటర్లు వెళితే స్వగ్రామం వస్తుందనగా, బుధవారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులు నరేంద్రను అడ్డుకున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నావ్.. కర్ఫ్యూను ఎందుకు ఉల్లంఘించావ్.. అంటూ పోలీసులు ప్రశ్నించడంతో తన గోడంతా చెప్పుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న ఎస్ఐ సహృదయంతో ఇంటి నుంచి అన్నం తెప్పించి పెట్టాడు. వైద్యుల అనుమతితో సొంత గ్రామానికి వెళ్లేందుకు పోలీసులు వాహనాన్ని ఏర్పాటు చేయగా, ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. అయితే 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు అతడికి సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Maharashtra, Police, Pune, Pune news