ప్రశాంత్ భూషణ్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు 1 రూపాయి జరిమానా చెల్లించడం విశేషం. ఐనప్పటికీ కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్తానని ఆరోజే చెప్పారు. చెప్పినట్లుగానే ఇవాళ రివ్యూ పిటిషన్ వేశారు.
భారత న్యాయ వ్యవస్థ, సీజేఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన దోషిగా తేల్చి.. ఒక్కరూపాయి ఫైన్ విధించడంపై ఆయన రివ్యూ పిటిషన్ వేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పుబట్టారు. తనపై కేసు వేసిన లాయర్ పిటిషన్ కాపీని తనకు ఇవ్వకుండానే ఏకపక్షంగా తీర్పు చెప్పారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం రెండు రివ్యూ పిటిషన్లు వేశారు ప్రశాంత్ భూషణ్. కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ప్రకటిస్తూ.. ఆగస్టు 14 ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబరు 14న ఆయన రివ్యూ పిటిషన్ వేశారు. ఇక ఒక రూపాయి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాలంటూ ఆగస్టు 31న కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన గురువారం మరో రివ్యూ పిటిషన్ వేశారు.
కాగా, ప్రశాంత్ భూషణ్ ఇప్పటికే కోర్టుకు 1 రూపాయి జరిమానా చెల్లించడం విశేషం. ఐనప్పటికీ కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్తానని ఆరోజే చెప్పారు. చెప్పినట్లుగానే ఇవాళ రివ్యూ పిటిషన్ వేశారు. కోర్టు స్వయంగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు.. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు.
కోర్టు ధిక్కరణ కేసులో ఆగస్టు 14న ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. ప్రశాంత్ భూషణ్ తీరు కోర్టు ధిక్కరణకు సంబంధించి తీవ్రమైన విషయమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆగస్టు 31న శిక్షను ఖరారు చేసిన కోర్టు.. ఒక రూపాయి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించాలని స్పష్టం చేసింది.
ప్రశాంత్ భూషణ్ జూన్‌లో భారత న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు, సీజేఐల గురించి రెండు వివాదాస్పద ట్వీట్లు చేశారు. ఒకదాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ, సుప్రీంకోర్టు, చివరి నలుగురు సీజేల పాత్ర గురించి అందులో పేర్కొన్నారు. మరొక ట్వీట్లో నాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే రూ.50 లక్షల విలువైన బైక్‌పై వెళ్తూ హెల్మెట్ ధరించలేదని ట్వీట్ చేశారు. ఐతే ఆ సమయంలో హెల్మెట్ లేకుండా జస్టిస్ బాబ్డే బైక్ నడపలేదు. వాస్తవానికి బైక్ స్టాండ్ వేసి ఉంటే, దానిపై ఆయన కూర్చున్నారు. ఐతే బైక్‌కు స్టాండ్ వేసి ఉన్న విషయాన్ని గమనించకుండా ట్వీట్ చేశారు ప్రశాంత్ భూషణ్. ఈ ట్వీట్‌పై ఆయన సారీ కూడా చెప్పారు.
అంతేకాదు ప్రశాంత్ భూషణ్‌పై మరో కోర్టు ధిక్కరణ కేసు కూడా నడుస్తోంది. 2009లో తెహెల్కా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టులో అవినీతి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరి 16 మంది చీఫ్ జస్టిస్‌లు అవినీతికి పాల్పడ్డారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదిస్తున్నారు. తదుపరి విచారణ అక్టోబరు 12న జరగనుంది.
కాగా, సహారా-బిర్లా డైరీ కేసు నుంచి జడ్జి లోయా మృతి వరకు, కహికోపుల్ ఆత్మహత్య నుంచి మెడికల్ ప్రవేశాల కుంభకోణాల వరకు, మాస్టర్ ఆఫ్ రోస్టర్ కాంట్రవర్సీ నుంచి అసోం ఎన్ఆర్సీ వరకు, ఆర్టికల్ 370 రద్దు నుంచి పౌరసత్వం చట్ట సవరణ వరకు.. ఇలా ఎన్నో అంశాలపై బాహాటంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ భూషణ్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.