ఆర్టీసీ (RTC). ప్రతీ పేదవాడికే కాదు మధ్య తరగతి జీవుడికీ ప్రయాణ సాధనం. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాక వేరే ఊరికి వెళ్లాలనుకున్నవారు ముందుగానే టికెట్లు బుక్ చేసి పెట్టుకుంటారు. అయితే తీరా బస్సు ఎక్కడానికి బస్‌స్టాప్ చేరుకున్నా.. మనం బుక్ చేసుకున్న బస్ సదరు స్టాప్‌కి రాకపోతే. బాధ వర్ణనాతీతం. ఏదో దగ్గరి ప్రయాణానికికైతే ఓకే కానీ, దూర ప్రయాణం వెళ్లాల్సి వస్తే తిప్పలు తప్పవు. ఏం చేస్తాం లే... అని మరో బస్సు చూసుకుంటారా? అయితే ఓ సీనియర్ సిటిజన్ మాత్రం అలా ఊరుకోలేదు. పోరాడాడు. తనను బస్సు ఎక్కించుకోనందుకు ఏకంగా ఆర్టీసీనే బోనులో నిల్చోబెట్టాడు. జరిమానానే కట్టించుకున్నాడు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
కర్ణాటక (Karnataka)లోని బనశంకరి 3వ స్టేజీకి చెందిన ఎస్ సంగమేశ్వరన్ అనే వ్యక్తి బెంగళూరు నుంచి తిరువణ్ణామలైకి KSRTC ఐరావత్ క్లబ్ క్లాస్‌లో ఆన్లైన్లో రిటర్న్ టిక్కెట్లను బుక్ చేశాడు. అతను అక్టోబర్ 12, 2019 న బెంగళూరు నుంచి బయలుదేరాడు. మరుసటి రోజు తిరిగి రావాల్సి ఉంది. మధ్యాహ్నానికి నిర్ణీత బస్టాప్‌కు చేరుకున్నాడు. అయితే గంటకుపైగా వేచి చూసినా బస్సు జాడ కనిపించలేదు. కండక్టర్ (conductor) కాంటాక్ట్ నంబర్‌తో సహా తన బస్సు వివరాలను పేర్కొంటూ సంగమేశ్వరన్కు స్టేట్ ట్రాన్స్పోర్టర్ నుండి SMS వచ్చింది. అతను నంబర్‌కు కాల్ చేశాడు. అయితే కొత్త తాత్కాలిక స్టాప్నకు రాకపోవడంతో బస్సు వెళ్లిపోయిందని కండక్టర్ చెప్పాడు. అప్పటికే బస్సు తిరువణ్ణామలాల్ నుంచి 30 కి.మీ. బయలుదేరిందని అతనికి చెప్పారు.
వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు..
నిరుత్సాహానికి గురైన సీనియర్ సిటిజన్ (Senior citizen) తిరువణ్ణామలై నుంచి మరో KSRTC బస్సులో రూ. 131 చెల్లించి హోసూర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి 69కి బెంగళూరుకు మరో బస్సు ఎక్కాడు. అయితే కేఎస్ఆర్టీసీ తీరుపై వృద్ధుడు అసహనం వ్యక్తంచేశాడు. ప్రీమియం సర్వీస్ టిక్కెట్లో బస్ స్టాప్‌లో మార్పు గురించి తెలియజేయలేదు. దీంతో సంగమేశ్వరన్ KSRTC మేనేజింగ్ డైరెక్టర్ మరియు జనరల్ మేనేజర్ (ట్రాఫిక్)కి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తూ శాంతినగర్‌లోని బెంగుళూరు 2వ అర్బన్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (Bangalore 2nd Urban Additional District Consumer Disputes Disputes Redressal Commission) (వినియోగదారుల ఫోరం)ను ఆశ్రయించారు.
రద్దీ ఉందని బస్‌స్టాప్ మార్పు..
పౌర్ణమి రోజున రద్దీని నియంత్రించడానికి స్థానిక పోలీసులు బస్‌స్టాప్‌ను తాత్కాలికంగా మరో ప్రదేశానికి మార్చడంపై బస్సు కండక్టర్ ఫిర్యాదుదారుడికి SMS పంపారని అధికారులు తెలిపారు. ఇది ఫిర్యాదుదారుని పొరపాటు అని అన్నారు. స్పాట్లో లేడు అని వివరించారు. బస్సులో మరో 23 మంది ప్రయాణికులు ఎక్కారని, అయితే ఫిర్యాదుదారుడు ఎక్కలేదని ఎండీ పేర్కొన్నారు.
దీంతో అక్టోబర్ 30, 2019న వ్యాజ్యం ప్రారంభమైంది. సంగమేశ్వరన్ తన వాదనను వినిపించారు. అయితే KSRTC న్యాయవాది వాదిస్తూ ఫిర్యాదుదారుని కేసు చట్టం ప్రకారం చెల్లదన్నారు. ఆరోపించిన సంఘటన జరిగిన ప్రదేశం తిరువణ్ణామలై మరియు దాని అధికార పరిధికి మించినది కనుక ఫోరమ్ కేసును కొట్టివేయాలని న్యాయవాది సూచించారు. అయితే ఆర్టీసీ వాదనలను నిరూపించడంలో విఫలమైంది. ఫోరమ్ ముందు బస్సు కండక్టర్‌ను హాజరుపరచడంలో యుటిలిటీ కూడా విఫలమైంది.
అక్టోబరు 26, 2021న వెలువరించిన తీర్పులో ఫిర్యాదుదారుడి ఐరావత్ టిక్కెట్‌పై రూ. 497 , ప్రత్యామ్నాయ బస్సు ప్రయాణానికి రూ. 131 మరియు రూ. 69 తిరిగి చెల్లించాలని వినియోగదారుల న్యాయస్థానం KSRTC మేనేజింగ్ డైరెక్టర్ మరియు GM (ట్రాఫిక్)ని ఆదేశించింది. అలాగే సీనియర్ సిటిజన్‌కు జరిగిన ఇబ్బందులకు రూ. 1,000 పరిహారం చెల్లించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.