Aryan Khan Consumed ganja: క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే క్లీన్‌చిట్ పొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan)మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) ఎదుట సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్యన్ ఖాన్ అమెరికాలో గ్రాడ్యేమేషన్ చదువుతున్న రోజుల్లోనే గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో ఎన్సీబీ పేర్కొంది. ఈ కేసులో అరెస్టు చేసిన 20 మందిలో 14 మందిపై ఎన్‌సీబీ శుక్రవారం ముంబయి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సరైన ఆధారాలు లేని కారణంగా ఆర్యన్ సహా ఆరుగురి పేర్లను మినహాయించింది. ఈ క్రమంలో ఛార్జిషీట్‌లో అనేక ఆస్తకికర విషయాలు వెల్లడయ్యాయి.
ఛార్జిషీట్ ప్రకారం..2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్‌సీబీ ముందు అంగీకరించాడు. ఆ సమయంలో.. కొన్ని నిద్ర సమస్యలు ఉన్నాయని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని కొన్ని ఇంటర్నెట్ కథనాల్లో చదివినట్లు వాంగ్మూలమిచ్చాడు. 2018లో మొదటి సారి ఆర్యన్ అమెరికాలో గంజాయి సేవించాడని, అక్కడ గంజాయిని తీసుకోవడం చట్టబద్ధమే కనుక ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆర్యన్ చెప్పాడని ఎన్సీబీ పేర్కొంది. అలాగే, లాస్‌ఏంజెలెస్‌లో సరదా కోసం మారిజువానా తీసుకున్నట్టు ఆర్యన్ అంగీకరించాడు. తన ఫోన్‌లో దొరికిన వాట్సాప్ డ్రగ్ చాట్ తానే చేసినట్లు అంగీకరించాడని ఎన్‌సీబీ తెలిపింది. "2020 మార్చ్ లో ఇండియాకు తిరిగి వచ్చాను. ఇక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆదిశ్ దుగ్గల్ ద్వారా గంజాయి సంపాదించాను. వాళ్లకు గ్రామ్‌కు రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు ఇచ్చేవాడిని. ఆర్బాజ్ మర్చంట్ నాకు ఏడెనెమిదేళ్లుగా ఫ్రెండ్. తను గంజాయి, హాషిష్(చరస్) తీసుకుంటాడు. నాకు హాషిష్ అంతగా నచ్చదు"అని ఆర్యన్ చెప్పినట్లు ఎన్సీబీ తెలిపింది. ముంబైకి చెందిన ఓ డ్రగ్ డీలర్ తనకు తెలుసని, కానీ అతడి ఊరు, పేరు తనకు తెలియదని ఆర్యన్ పేర్కొన్నాడు. విచారణ సందర్భంగా ఆర్యన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు గ్రాముల చరస్ (గంజాయి నుంచి తయారుచేస్తారు) ను ఆయన వినియోగించలేదని ఈ కేసులో మరో నిందితుడైన అర్బాజ్ చెప్పినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నౌకలోకి డ్రగ్స్ తీసుకురావొద్దని ఆర్యన్ తనను హెచ్చరించినట్టు కూడా అర్బాజ్ చెప్పాడని చార్జ్‌షీట్‌లో ఎన్సీబీ పేర్కొంది.
ALSO READ Viral Video : సిద్ధూ మూసేవాలా మృతితో ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు
గంజాయి విషయంలో నటి అనన్య పాండే(Annanya pandey)తోనూ చాట్ చేసినట్లు ఆర్యన్ ఖాన్ అంగీకరించాడని ఛార్జిషీట్‌లో వెల్లడైంది. ఈ ఆరోపణల ఆధారంగా.. ఎన్‌సీబీ ఆమెను విచారించి, స్వచ్ఛంద స్టేట్‌మెంట్‌లనూ రికార్డు చేసింది. ఈ చాట్ తానే చేసినట్లు ఆమె అంగీకరించిందని.. అయితే ఏదో తమాషాగా, జోక్‌గా భావించి చేశానని వెల్లడించినట్లు ఎన్‌సీబీ తెలిపింది. క్రూజ్ నౌక పార్టీ సమయంలో ఆర్యన్ డ్రగ్స్ కోసం ఓ కొత్త నటితో చాటింగ్ చేసినట్లు ఎన్‌సీబీ అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. తన విషయంలో ఆర్యన్ అబద్ధం చెబుతున్నాడని, అతను ఇలా ఎందుకు చెప్పాడో తెలియదని అనన్య వాపోయినట్లు అభియోగపత్రంలో నమోదైంది. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో సోదాలు చేపట్టగా ఎటువంటి నిషిద్ధ పదార్థాలు లభ్యం కాలేదని, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు ఎన్‌సీబీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.