రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక...విపక్ష ఐక్యతకు పరీక్ష!

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని బీజూ జనతా దళ్‌కు ఆఫర్ చేయడం ద్వారా ఎన్డీయేతర కూటమిని మరింత విస్తరించాలని ప్రాంతీయ పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

news18
Updated: June 18, 2018, 12:16 PM IST
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక...విపక్ష ఐక్యతకు పరీక్ష!
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన మమతా బెనర్జీ(ఫైల్ ఫోటో) (PTI)
news18
Updated: June 18, 2018, 12:16 PM IST
త్వరలో జరగబోయే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విపక్షాల ఐక్యతకు గట్టి పరీక్ష పెట్టనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ పదవికి విపక్షాల తరఫున ఒకే అభ్యర్థిని బరిలో నిలపాలని, ఆ అభ్యర్థికి తృణాముల్ కాంగ్రెస్ కూడా మద్ధతు ఇవ్వాలని ఆయన మమతను కోరారు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం మమత‌ను కలిసిన అహ్మద్ పటేల్ కీలక చర్చలు జరిగినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిలో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ పీజే కురియన్ కొనసాగుతున్నారు. మరో పర్యాయం ఈ పదవిలో కొనసాగేందుకు కురియన్ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో మరో అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను విపక్షాల ఐక్యత చాటేందుకు తగిన అవకాశంగా వాడుకోవాలని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం...ఎన్డీయేతర పార్టీలను కలుపుకుని వెళ్లాలని భావిస్తోంది.

నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెసేతర విపక్ష పార్టీల నేతలు...రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలను అవకాశంగా మార్చుకుని, ఎన్డీయేతర కూటమిని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతా దళ్‌ను కూడా ఈ కూటమిలోకి తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఎగువ సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ...డిప్యూటీ ఛైర్మన్ పదవికి తమ అభ్యర్థినే బరిలో నిలపాలని యోచిస్తోంది. ఎన్డీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో డిప్యూటీ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహాలను తిప్పికొట్టే ప్రతివ్యూహాల్లో కమలనాథులు నిమగ్నమయ్యారు.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా విపక్ష అభ్యర్థి గెలవాలంటే 9 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన బీజేడీ, ఆరుగురు సభ్యులతో కూడిన టీఆర్ఎస్ మద్ధతు చాలా కీలకం. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతిచ్చేది లేదని ఆ పార్టీలు ఇప్పటికే స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో బీజేడీని కూడా ఎన్డీయేతర కూటమిలోకి తీసుకొచ్చేందుకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని బీజేడీకి ఆఫర్ చేయాలని విపక్షాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
First published: June 18, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...