కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు (Congress President Election Result) ఇవాళ వెలువడతాయి. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు కౌంటింగ్ జరుగుతుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల నుంచి బ్యాలెట్ బాక్సులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge), శశిథరూర్ ((Shashi Tharoor) పోటీపడ్డారు. వీరిద్దరిలో ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ పెద్దల మద్దతు ఆయనకే ఉందని.. ఇటీవల పలు సందర్భాల్లో శశిథరూరే చెప్పారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గేనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. బ్యాలెట్ బాక్సులన్నీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచామని, ఉదయం 10 గంటల సమయంలో కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ వర్గాల నుంచి ఐదు మంది చొప్పున ఏజెంట్లు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. రెండు వర్గాల నుంచి మరో ఇద్దరు ఏజెంట్లను రిజర్వ్‌లో ఉంచుతారు. వీరితో పాటు ఇరువురు నేతల మద్దతుదారులు కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భారీగా చేరుకోనున్నారు.
దీపావళి కానుకగా రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ..CNG,PNGపై వ్యాట్ కూడా తగ్గింపు..ఎంత శాతమంటే
అక్టోబరు 17న సోమవారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరిగింది. దాదాపు 96 శాతం ఓటింగ్ జరిగినట్లు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు సహా దాదాపు 9500 మంది ప్రతినిధులు (ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు) పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సోమవారం ఓటు వేశారు.
137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇదే ఆరోసారి. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంతకు ముందు 1939, 1950, 1977, 1997, 2000 సంవత్సరాల్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఈసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గాంధీయేతర కాంగ్రెస్ నేతలే పోటీపడ్డారు. అందువల్ల 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టబోతున్నారు. ఇంతకు ముందు సీతారాం కేసరి గాంధీయేతర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఖర్గే, థరూర్‌లలో ఒకరు.. కాంగ్రెస్ అధ్యక్షడిగా ఎన్నికవనున్నారు.
కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేత చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఏపీలోని కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఆయన యాత్ర ఏపీలో కొనసాగుతున్న సమయంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానుండడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Congress President Elections, Mallikarjun Kharge, Shashi tharoor