news18-telugu
Updated: October 22, 2018, 10:53 PM IST
రమణ్ సింగ్, కరుణ శుక్లా (ఫైల్ ఫొటోలు)
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలకు గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్‌సింగ్‌పై బలమైన అభ్యర్థిని పోటీకి దింపేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయీ మేనకోడలు కరుణ శుక్లాను బరిలోకి దింపుతోంది. సోమవారం కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయింది. అందులో కరుణకు స్థానం కల్పించారు. స్క్రీనింగ్ కమిటీ సూచన మేరకే ఆమెను రమణ్‌సింగ్‌పై పోటీ చేసేందుకు హైకమాండ్ నిర్ణయించింది.
చత్తీస్‌గఢ్‌లో ప్రజల సమస్యలపై కొంతకాలంగా కరుణ శుక్లా గళం విప్పుతున్నారు. అంతేకాదు వాజ్‌పేయీ మరణాన్ని బీజేపీ తమ రాజకీయాలకు వాడుకుంటోందని ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే వాజ్‌పేయి అస్థికలతో యాత్ర నిర్వహించారని మండిపడ్డారు.

అటల్ బీహారీ వాజ్‌పేయి అస్థికలతో దేశమంతా యాత్ర నిర్వహించారు. ఓట్ల కోసమే ఇదంతా చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వాజ్‌పేయిని సీఎం రమణ్‌సింగ్ విస్మరించారు. ఇప్పటివరకు సంస్మరణ సభ నిర్వహించకపోవడం శోచనీయం.
— కరుణ శుక్లా, వాజ్‌పేయీ మేనకోడలు
1950 ఆగస్టు 1న శుక్లా జన్మించారు. భోపాల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరారు. 1993లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో జాంజ్‌గిర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. తనను మాసినకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ 2013లో ఆమె బీజేపీ నుంచి బయటకొచ్చారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై బిలాస్పూర్ లోక్‌సభ స్థానంలో పోటీచేసి ఓడిపోయారు. బీజేపీ నేత లఖన్ లాల్ సాహు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో ఏకంగా చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌పై బరిలో దిగుతున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 22, 2018, 10:47 PM IST