HOME »NEWS »NATIONAL »congress led udf in kerala asking the left to withdraw its candidate from the wayanad constituency media reports nk

వాయనాడ్‌లో రాహుల్ గెలుపు నల్లేరుపై నడకేనా... లెఫ్ట్ పార్టీలు పోటీ నుంచీ తప్పుకునే అవకాశం...

వాయనాడ్‌లో రాహుల్ గెలుపు నల్లేరుపై నడకేనా... లెఫ్ట్ పార్టీలు పోటీ నుంచీ తప్పుకునే అవకాశం...
రాహుల్ గాంధీ (File)

Lok Sabha Elections 2019 : దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకోవడంలో సఫలమవుతున్న కాంగ్రెస్... కేరళలో మరో సంచలనానికి తెరతీస్తుందా?

  • Share this:
    కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ... యూపీలోని అమేథీతోపాటూ... కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రకటన కాంగ్రెస్ నుంచీ రాగానే... కేరళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ ప్రకటనను ఖండించిన సీపీఎం... తాము రాహుల్‌ని ఓడిస్తామని ప్రకటించింది. ఐతే... దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో మిత్రత్వాన్ని కోరుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు కేరళలోనూ సీపీఎంను తమవైపు తిప్పుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం... కేరళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని చర్చలకు రంగంలోకి దింపింది. వామపక్షాలతో చర్చిస్తున్న యూడీఎఫ్... ఆ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలోంచీ తప్పుకోమని కోరుతున్నట్లు తెలిసింది. ఈ చర్చలు ఫలిస్తే... ప్రధాన ప్రత్యర్థిగా ఉండే వామపక్ష అభ్యర్థి బరిలో లేనట్లే అవుతుంది. తద్వారా రాహుల్‌కు వాయనాడ్‌లో దాదాపు పోటీయే లేకుండా పోతుంది.

    లెఫ్ట్ కాకుండా మిగిలిన మరో పార్టీ ముస్లింలీగ్... ఇప్పటికే యూడీఎఫ్‌లో మిత్ర పార్టీగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో... తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు లేవు. ఈ స్థానం కాంగ్రెస్ కంచుకోట కావడం, బరిలో రాహుల్ ఉండటం వల్ల... బీజేపీ మాత్రమే కాస్తో కూస్తో పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల రాహుల్ సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. ఐతే... ఇందుకు లెఫ్ట్ పార్టీలు ఒప్పుకుంటాయా అన్నది అసలు సమస్య. బెంగాల్‌లో తృణమూల్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ మాట వినేందుకు లెఫ్ట్ నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరీ ఎంతవరకూ ఒప్పుకుంటారన్నది త్వరలో తేలుతుంది.




    ఒకవేళ లెఫ్ట్ పార్టీలు తప్పుకుంటే... రాహుల్ గెలుపు ఏకగ్రీవం కాకపోయినా... గెలుపు తథ్యమవుతుంది. అందువల్ల రాహుల్‌కి అమేథీలో తప్పక గెలవాల్సిన అవసరం తప్పుతుంది. ఫలితంగా ఆయన దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.

    మంగళవారం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించాలనుకుంటోంది. ఇందుకోసం ఫైనల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేనిఫెస్టో విడుదలకు ముందే... వాయనాడ్‌లో రాజకీయ అంశాలపై ఓ అవగాహనకు వచ్చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    వాయనాడ్ ప్రత్యేకతలు ఇవీ :
    * 2008లో నియోజక వర్గాల పునర్విభజనలో ఏర్పడింది.
    * 30 శాతం అడవే. జనాభా తక్కువే
    * హిందువుల మొత్తం జనాభా 49.7 శాతం. ఎస్సీలు 35.4 శాతం, ఎస్టీలు 7.6 శాతం.
    * క్రిస్టియన్లు 21.5 శాతం, ముస్లిం మైనార్టీలు 28.8 శాతం.
    * 7 అసెంబ్లీ సెగ్మెంట్లు 3 జిల్లాల్లో - వాయనాడ్, కోజికోడ్, మళప్పురంలో ఉన్నాయి.
    * 2009, 2014లో కాంగ్రెస్ నుంచీ ఎంఐ షానవాజ్ గెలిచారు. 2009లో 1.53 లక్షల ఓట్ల తేడాతో.... 2014లో 20,000 మెజార్టీతో గెలుపొందారు.
    * మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. గిరిజన గ్రామాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది.
    * రాజకీయంగా ప్రస్తుతం వాయనాడ్ కాంగ్రెస్‌కి కంచుకోట అనుకోవచ్చు. ప్రస్తుత కేరళ ప్రభుత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో కాంగ్రెస్‌తోపాటూ, ముస్లింలీగ్ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది.
    * వాయనాడ్‌లోని ఏడు లోక్ సభ నియోజక వర్గాల్లో... 4 చోట్ల ముస్లింల ఆధిపత్యం ఉంది. వాళ్లు కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నారు.
    * ఇక్కడి ఓటర్లలో ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కూలీలు, ప్లాంటేషన్ శ్రామికులే. కాంగ్రెస్ పథకాలపై వాళ్లు పాజిటివ్‌గా ఉన్నారు.
    * మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో రాహుల్ ఈజీగా గెలిచేస్తారన్నది కాంగ్రెస్ విశ్లేషణ.
    First published:April 01, 2019, 12:12 IST