హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పరువునష్టం కేసుపై రాహుల్ గాంధీ పోరాటం.. రేపు సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్

పరువునష్టం కేసుపై రాహుల్ గాంధీ పోరాటం.. రేపు సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్

రాహుల్ గాంధీ (image credit - PTI)

రాహుల్ గాంధీ (image credit - PTI)

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చడంతో.. దీనిపై పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు ఇవీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. రేపు సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం (defamation case) కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్.. పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై రేపు పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. తనను దోషిగా తేల్చడంపై, రెండేళ్ల జైలు శిక్ష వేయడంపై రాహుల్ పైకోర్టులో సవాల్ చేయబోతున్నారు.

రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది. ఆ ప్రకారమే రాహుల్ రేపు సవాల్ చేయబోతున్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదా తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలిసింది.

రాహుల్ గాంధీకి నెలపాటూ గడువు ఇచ్చిన సూరత్ కోర్టు.. బెయిల్ ఇచ్చింది. ఆ వెంటనే లోక్ సభ సెక్రటేరియట్.. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాహుల్ విషయంలో అంత కంగారు ఎందుకని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.

పైకోర్టు గనుక.. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే... రాహుల్ గాంధీకి పార్లమెంట్ సభ్యత్వం తిరిగి దక్కుతుంది. అలా కాకుండా.. కింది కోర్టు తీర్పును సమర్థిస్తే.. అప్పుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. రాహుల్ గాంధీ మాత్రం 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.

బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ.. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. "దొంగలందరికీ కామన్‌గా మోదీ అనే ఇంటి పేరు ఉంటుంది" అని రాహుల్ అన్న మాటపై ఆయన ఈ కేసు వేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ , విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ OBC కమ్యూనిటీని అవమానించారన్న బీజేపీ.. రాహుల్ చట్టానికి అతీతులు కాదని తెలిపింది.

First published:

Tags: Rahul Gandhi

ఉత్తమ కథలు