నన్ను, ప్రియాంకను కొట్టినా, చంపినా రైతుల వెంటే నిలబడతాం -Lakhimpur వెళ్లి తీరుతా : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

Rahul Gandhi on Lakhimpur Kheri Violence : దేశం కోసం, ప్రజల తరఫున నిలబడటానికి, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా తాము ముందునుంచే శిక్షణ పొంది ఉన్నామని, పోరాటం కాంగ్రెస్ సహజ లక్షణమని రాహుల్ గాంధీ చెప్పారు. యూపీలోని లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండను ఖండించిన ఆయన.. నిర్బంధం, ఆంక్షలు ఉన్నప్పటికీ ఇవాళ క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులను పరామర్శిస్తానని స్పష్టం చేశారు..

  • Share this:
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసించిన రైతులను కేంద్ర మంత్రి కొడుకు కారుతో తొక్కించి చంపిన ఘటనపై ఉద్రిక్తత, ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న చోటుచేసుకున్న హింసలో నలుగురు రైతులు, ఓ స్థానిక జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలు కలిపి మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆషిష్ మిశ్రాపై పోలీసులు హత్యకేసు నమోదు చేసినా అతణ్నింకా అరెస్టు చేయకపోవడం, పోస్ట్ మార్టం నివేదికలపై తకరారు, బాధిత కుటుంబాల్ని కలవనీయకుండా విపక్ష నేతలపై నిర్బంధం విధించడంపై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ..

లఖీంపూర్ జిల్లాలో రైతులపై హత్యాకాండను ఓ పద్ధతి ప్రకారం జరిగిన దాడిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. తొలుత భూసేకరణ చట్టాన్ని బలహీన పర్చిన మోదీ సర్కారు.. అటుపై నూతన సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల వెన్ను విరిచిందని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న రైతులపై, వారికి మద్దతుగా నిలిచిన విపక్షాలపై మోదీ సర్కారు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను కలవడానికి వీల్లేదని యూపీ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, తాను లఖీంపూర్ వెళతానని రాహుల్ స్పష్టం చేశారు.

చనిపోయిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీతోపాటు ఐదుగురు సభ్యుల బృందం పరామర్శిస్తుందని, అందుకు అనుమతివ్వాల్సిందిగా కాంగ్రెస్ పెట్టుకున్న దరఖాస్తును యూపీ పోలీసులు తృణీకరించారు. రాహుల్ కుగానీ ఆయన వెంట రావాలనుకున్న ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్, పంజాబ్ సీఎం చన్నీ సహా ఎవరినీ అనుమతించబోమని యూపీ పోలీసులు స్పష్టం చేశారు. బుధవారం నాడు లక్నో బయలు దేరడానికి ముందు ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రి కొడుకు అయినంత మాత్రాన క్రిమినల్స్ ను స్వేచ్ఛగా వదిలేయడానికి వీల్లేదని, గతంలో హాత్రస్ లాంటి ఘటనల సందర్భంలో విపక్షాల ఒత్తిడి వల్లే కనీసం నిందితులపై కేసులు నమోదయ్యాయని, ప్రస్తుత లఖీంపూర్ ఘటనలోనూ విపక్షాల పోరాటం వల్లే అసలైన నిందితులపై కేసులు నమోదయ్యాయని రాహుల్ గాధీ గుర్తు చేశారు. అసలు లఖీంపూర్ లో నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకుని, బాధితులకు భరోసా కల్పించేందుకే తాను వెళ్లాలనుకుంటున్నానని, ఇందులో రాజకీయాలకు తావు లేదని కాంగ్రెస్ నేత అన్నారు.

లఖీంపూర్ హింసలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో సీతాపూర్ లో అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అనుమతి లభించేదాకా తాను సత్యాగ్రహం కొనసాగిస్తానని ప్రియాంక చెప్పారు. తన సోదరి ప్రియాంక చేస్తోన్న సత్యాగ్రహం కంటే రైతుల ఇష్యూలపైనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని, నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చావుకు కూడా తాము వెనుకాడబోమని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీని లఖీంపూర్ వెళ్లనీయకుండా యూపీ పోలీసులు గట్టి బందోబస్తు చేసిన దరిమిలా ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది..
Published by:Madhu Kota
First published: