CONGRESS LEADER PRIYANKA GANDHI TO VISIT HYDERABAD TODAY FOR HIS SON EYE TREATMENT IN LV PRASAD HOSPITAL SK
Priyanka Gandhi: కుమారుడి కోసం నేడు హైదరాబాద్‌కు వస్తున్న ప్రియాంక గాంధీ..
ప్రియాంక గాంధీ
Priyanka Gandhi hyderabad Tour: ప్రియాంక గాంధీ వ్యక్తిగత పర్యటన కావడంతో కాంగ్రెస్ నేతలెవరు ఆమెను కలిసే అవకాశం లేదని సమాచారం. ప్రియాంక గాంధీ కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్తారు. కుమారుడికి చికిత్స తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లిపోతారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు హైదరాబాద్‌కు (Priyanka Gandhi Hyderabad Tour) వస్తున్నారు. తన కుమారుడు రైహాన్ కంటి పరీక్షల కోసం ఆమె హైదరాబాద్‌కు వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (LV Prasad Eye Hospital)లో రైహాన్ (Raihan Vadra Eye Treatment)కు కంటి చికిత్స చేయించనున్నారు. ఇవాళ, రేపు హైదరాబాద్‌లోనే ఉంటారు.
నాలుగున్నరేళ్ల కిందట స్కూళ్లో క్రికెట్ ఆడుతుండగా రైహాన్ కంటికి గాయమయింది. మొదట ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. ఐతే అక్కడి వైద్యుల సలహా హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం రైహాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందజేశారు. తాజాగా మరోసారి ఇక్కడే కంటి పరీక్షలు చేయించనున్నారు. కంటి చికిత్స అనంతరం గురువారం సాయంత్రం ప్రియాంక గాంధీ, ఆమె కుమారుడు రైహాన్ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు.
ఇది ప్రియాంక గాంధీ వ్యక్తిగత పర్యటన కావడంతో కాంగ్రెస్ నేతలెవరు ఆమెను కలిసే అవకాశం లేదని సమాచారం. అసలు ఆమె హైదరాబాద్‌కు వస్తున్నట్లు కొందరు ముఖ్య నేతలతకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ప్రియాంక గాంధీ సూచనతోనే ఆమె పర్యటన వివరాలను బయటకు చెప్పడం లేదని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్తారు. కుమారుడికి చికిత్స తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లిపోతారు. కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లే అవకాశం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. స్వాగత కార్యక్రమాలు కూడా ఉండవని తెలిపాయి.
ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్ (Raihan Vadra), కుమార్తె మిరాయా (Miraya) ఉన్నారు. రైహాన్ పూర్తిపేరు రైహాన్ రాజీవ్ వాద్రా. రైహాన్ వాద్రాకు ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన కంటికి గాయమైన సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాల నుంచి 'Dark Peception' పేరిట ఈ ఏడాది జులైలో తన తొలి ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు రైహాన్. ఫోటోగ్రఫీ విషయంలో తల్లి ప్రియాంక గాంధీ తనను చాలా ప్రోత్సహిస్తుందని ఆ సందర్భంగా రైహాన్ వెల్లడించారు. ఫొటో ఎగ్జిబిషన్ కాన్సెప్ట్‌కు సంబంధించి మామయ్య రాహుల్ గాంధీ సాయం చేసినట్లు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.