Priyanka gandhi tests covid positive : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi)కరోనా బారినపడ్డారు. తల్లి,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డ మరుసటి రోజే ప్రియాంక గాంధీ కూడా కోవిడ్ బారినపడ్డారు. శుక్రవారం చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని, స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ప్రియాంకగాంధీ శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సోనియా ఐసొలేషన్‌లో ఉన్నారని, ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించామని సుర్జేవాలా ట్వీట్ చేశారు.. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు కూడా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. సోనియా గాంధీతో గత వారం రోజులుగా సమావేశమైన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కాగా, కొవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాజీ.. కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు,దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 4,041 మంది వైరస్ బారినపడ్డారు. దాదాపు 84 రోజుల తర్వాత కేసులు 4 వేల మార్కును దాటాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.73గా ఉంది. ఒక్కరోజే 10 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గురువారం 2363 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Covid positive, Priyanka Gandhi, Sonia Gandhi