పోలీసుల నిర్బంధంలోనే ప్రియాంక గాంధీ సత్యాగ్రహం -తనను ఉంచిన గదిలో చీపురు పట్టి ఇలా -Lakhimpur పోనివ్వకుంటే నిరాహార దీక్ష?

ప్రియాంక గాంధీ సత్యాగ్రహం

Lakhimpur Kheri News Updates | ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలో రైతుల హత్యలపై దేశమంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు లక్నోలోనే నిర్బంధించారు. 20 గంటలు దాటినా నిర్బంధంలోనే కొనసాగుతోన్న ప్రియాంక సత్యాగ్రహానికి దిగారు. తన గదిని స్వయంగా ఊడ్చుకుని, నిరసన దీక్ష చేపట్టారు. లఖింపూర్ పోనివ్వకుంటే ఆమె నిరాహార దీక్షకు దిగొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి..

  • Share this:
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికీ పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. లఖింపూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న హింసలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతోన్న ఆమెను పోలీసులు అడ్డుకుని లక్నోలోని ఓ గెస్ట్ హౌజ్ కు తరలించడం తెలిసిందే. 24 గంటలు కావొస్తున్నా ప్రియాంకను పోలీసులు విడిచిపెట్టలేదు. అక్రమ నిర్బంధాన్ని సవాలు చేస్తూ ఆమె తనను ఉంచిన గదిలోనే సత్యాగ్రహానికి దిగారు..

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన 20 గంటలుగా లక్నోలోని ప్రభుత్వ గెస్ట్ హౌజ్ లో పోలీసుల చెరలో ఉన్నారు. ఫోన్ ద్వారా పలు మీడియా సంస్థలతో మాట్లాడిన ఆమె.. యూపీ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. అడుగడుగునా పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఇన్ని గంటలైనా తనపై కేసు నమోదు చేయకపోవడం, కోర్టులోనైనా ప్రవేశపెట్టకపోవడాన్ని బట్టి యూపీ పోలీసుల తీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చని ప్రియాంక అన్నారు. రైతుల్ని హత్య చేసిన కేంద్ర మంత్రి కొడుకేమో స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని, బాదితుల్ని పరామర్శించడానికి వచ్చిన తానేమో నిర్బంధంలో ఉన్నానని ప్రియాంక వాపోయారు..


గెస్ట్ హౌజ్ లో పోలీసులు బంధించిన గదిలోనే ప్రియాంక గాంధీ సత్యాగ్రహాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం నాడు ప్రియాంక గదిని తానే ఊడ్చుతోన్న వీడియోను కాంగ్రెస్ విడుదల చేయగా, అది వైరలైంది. పోలీసులు అక్రమంగా తనను బంధించారన్న ఆమె.. లఖింపూర్ వెళ్లి రైతులను కలిసే విషయంలో వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. అందుకు పోలీసులు అనుమతిచ్చేదాకా సత్యాగ్రహం కొనసాగిస్తానని తెలిపారు. ప్రియాంక నిర్బంధాన్ని గర్హిస్తూ యూపీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లోనూ ప్రియాంకకు మద్దతుగా ర్యాలీలు సాగాయి. కాగా,

లఖింపూర్ లో హిసాత్మక ఘటనలు, రైతులు, బీజేపీ కార్యకర్తల మరణాలు దురదృష్టకరమన్న యూపీ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్.. ప్రియాంక గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. బాదితులకు అండగా ఉండాలనుకోవడం కరెక్టే కావొచ్చు కానీ, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది కోసం శవరాజకీయాలు చేస్తానంటే మాత్రం ప్రియాంక సహా ఎవరినైనా అడ్డగిస్తామని మంత్రి అన్నారు. పోలీసులు గనుక లఖింపూర్ పోనివ్వకుంటే సత్యాగ్రహాన్ని నిరాహార దీక్షగా  కొనసాగించాలని ప్రియాంక భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published: