నిన్న హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న లఖింపూర్ జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు.. నేడు ఆమెను అరెస్ట్ చేశారు. 144 సెక్షన్ నిబంధనలను అతిక్రమించారని.. శాంతియుత పరిస్థితులను దెబ్బతిసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లఖింపూర్ ఖేరి జిల్లాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రియాంక గాంధీని ఆదివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీని జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఆమెకు కానీ, ఆమె కార్యాలయానికి కానీ ఎలాంటి సమాచారం అందలేదు. అయితే శాంతియుత పరిస్థితులను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 11 మందిపై కేసు నమోదు చేసినట్టు హర్గావ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. వారిలో ప్రియాంక గాంధీ, దీపేంద్ర హుడా, అజయ్ కుమార్ లల్లూ కూడా ఉన్నారని వివరించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఘటనకు కారణమైన వాళ్లు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే.. తమను ఎందుకు నిర్భందించారని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ లక్నో ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయించారు. తాను యూపీలోని సీతాపూర్‌లో ప్రియాంక గాంధీని కలిసేందుకు వచ్చానని.. కానీ ఇందుకు తనను అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ ఘటన అంతా ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందే అని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ అన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 20 గంటలకుపైగా లక్నోలోని ప్రభుత్వ గెస్ట్ హౌజ్ లో పోలీసుల నిర్భంధంలో ఉన్నారు. ఫోన్ ద్వారా పలు మీడియా సంస్థలతో మాట్లాడిన ఆమె.. యూపీ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. అడుగడుగునా పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఇన్ని గంటలైనా తనపై కేసు నమోదు చేయకపోవడం, కోర్టులోనైనా ప్రవేశపెట్టకపోవడాన్ని బట్టి యూపీ పోలీసుల తీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చని ప్రియాంక అన్నారు. రైతుల్ని హత్య చేసిన కేంద్ర మంత్రి కొడుకేమో స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని, బాదితుల్ని పరామర్శించడానికి వచ్చిన తానేమో నిర్బంధంలో ఉన్నానని ప్రియాంక వాపోయారు.గెస్ట్ హౌజ్ లో పోలీసులు బంధించిన గదిలోనే ప్రియాంక గాంధీ సత్యాగ్రహాన్ని కొనసాగించారు. సోమవారం నాడు ప్రియాంక గదిని తానే ఊడ్చుతోన్న వీడియోను కాంగ్రెస్ విడుదల చేయగా, అది వైరలైంది. పోలీసులు అక్రమంగా తనను బంధించారన్న ఆమె.. లఖింపూర్ వెళ్లి రైతులను కలిసే విషయంలో వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. అందుకు పోలీసులు అనుమతిచ్చేదాకా సత్యాగ్రహం కొనసాగిస్తానని తెలిపారు. ప్రియాంక నిర్బంధాన్ని గర్హిస్తూ యూపీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లోనూ ప్రియాంకకు మద్దతుగా ర్యాలీలు సాగాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.