నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు (National Herald Money laundering case)లో సోనియా గాంధీ (Sonia Gandhi) ఈడీ విచారణ ముగిసింది. ఈడీ (Enforcement directorate) కేంద్రకార్యాలయంలో సోనియాపై అధికారులు ఇవాళ కూడా పలు ప్రశ్నలు వేశారు. వాటికి సోనియా గాంధీ సమాధానాలు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లిపోయారు. మనీల్యాండరింగ్ కేసులో సోనియా గాంధీకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేయలేదు. అంటే ఆమె విచారణ ముగిసినట్లే అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ కేసులో మళ్లీ విచారణ జరపాలనుకుంటే... ఈడీ మరోసారి సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది. మంగళవారం రోజున ఆరు గంటల పాటు ఈడీ సోనియాను విచారించింది. జులై 21న మూడు గంటల పాటు ఆమెను విచారించారు. అనంతరం మంగళవారం మరో ఆరుగంటలు, ఇవాళ మరో మూడు గంటలు... ఇలా మొత్తం 12 గంటల పాటు సోనియా గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. 100కి పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
Congress interim president Sonia Gandhi's questioning by ED in the National Herald case concludes: Sources https://t.co/tqSXv8MvnL
— ANI (@ANI) July 27, 2022
సోనియా గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఇవాళ ధర్నా చేపట్టారు. అటు ఎంపీలు కూడా విజయ్ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఐతే ప్రశాంతంగా ధర్నా చేస్తున్న 65 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాగూర్ ఆరోపించారు. ఈడీని వాడుకుంటూ గాంధీ ఫ్యామిలీపై కేంద్రం కక్షసాధింపునకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఇంతలా ఎందుకు టార్చర్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..?
కాంగ్రెస్‌లోని కొంతమంది నేతలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్(National Herald) అనే న్యూస్ పేపర్‌ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో కథనాలను స్ఫూర్తిదాయక కథనాలను అందించి స్వాతంత్య్ర కాంక్షను రేపింది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ప్రజల్లో ఓ ముద్ర పడింది. స్వాతంత్య్రం అనంతరం అధికార న్యూస్ పేపర్‌గా చలామణి అయింది. తీవ్ర నష్టాల క్రమంలో 2008లో నేషనల్ హెరాల్డ్‌ని మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు తక్కువ మొత్తానికే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ విచారిస్తోంది. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని కూడా ప్రశ్నించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.