దేశ రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి విజయ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లిన రాహుల్ గాంధీ.. రాష్ట్రపతికి ఈ అంశంపై వినతి పత్రం అందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కేవలం కొంతమంది కార్పొరేట్ల కోసమే ప్రధాని మోదీ ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను వంచిందని ఆరోపించారు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకునేవరకు రైతులు ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్లబోరని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. తనకు ఎవరు వ్యతిరేకంగా మారితే వారిని దేశ ద్రోహులుగా ప్రధాని మోదీ చిత్రీకరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ కొత్త చట్టాల కారణంగా దేశంలోని అంతా ఇబ్బంది పడతారని అన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రియాంకా ఇవాళ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతికి రైతు సంతకాలతో ఉన్న పత్రాలను సమర్పించేందుకు ప్రియాంకా ర్యాలీ తీశారు. అయితే పలువురు కాంగ్రెస్ నేతలతో రాష్ట్రపతి భవన్ వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రియాంకను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను మందిర్‌మార్గ్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రెండు కోట్ల మంది రైతులు సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతికి సమర్పించాలని ప్రియాంక భావించారు.
రైతులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకే ఈ ర్యాలీని చేపట్టినట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఎన్నికైన ఎంపీలు ఉన్నారని, రాష్ట్రపతిని కలిసే హక్కు అందరికీ ఉందని, ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వాలని ప్రియాంక అన్నారు. లక్షలాది మంది రైతుల మనోభావాలను వినేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆమె ఆరోపించారు. రైతులను దేశ వ్యతిరేకులని ప్రభుత్వం ఆరోపిస్తుందంటే, అప్పుడు ప్రభుత్వం నేరానికి పాల్పడుతున్నట్లే అని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New Agriculture Acts, Rahul Gandhi