HOME »NEWS »NATIONAL »committee key proposals to modi govt on minimum age as 21 years for marriages of women hsn

అమ్మాయిల పెళ్లి వయసును పెంచేందుకు రంగం సిద్ధం.. కమిటీ చేసిన ప్రతిపాదనలివే..!

అమ్మాయిల పెళ్లి వయసును పెంచేందుకు రంగం సిద్ధం.. కమిటీ చేసిన ప్రతిపాదనలివే..!
ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్న ఈ దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును 21కి పెంచడం సాధ్యమా.? ఇది భారత్ లో ఆచరణకు నోచుకుంటుందా.? అన్న దానిపై కేంద్రం గతేడాదే ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. యువతుల పెళ్లి వయసును పెంచాల్సిందేనన్న గట్టి సంకల్పంతో ఉన్న మోదీ సర్కారుకు ఆ కమిటీ తన నివేదికను అందజేసింది.

 • Share this:
  భారతదేశంలో యువతీ యువకుల పెళ్లిళ్లకు కనీస వయసు ఎంత.? పురుషులకయితే 21 ఏళ్లు, స్త్రీలు అయితే 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు. అయితే అన్నింటిలోనూ సమానత్వం పాటిస్తూ, స్త్రీ పురుషుల పెళ్లి వయసులో మాత్రం దాన్ని పాటించడం లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్లి చేస్తే మరీ చిన్నవయసులోనే గర్భవతి కావడం జరుగుతోంది. దాని వల్ల అటు పుట్టబోయే బిడ్డ, ఇటు తల్లి కూడా ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చిన్న వయసులోనే కాన్పు నొప్పులను భరించలేక కన్నుమూస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అందుకే అయితే ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్న ఈ దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును 21కి పెంచడం సాధ్యమా.? ఇది భారత్ లో ఆచరణకు నోచుకుంటుందా.? అన్న దానిపై కేంద్రం గతేడాదే ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. యువతుల పెళ్లి వయసును పెంచాల్సిందేనన్న గట్టి సంకల్పంతో ఉన్న మోదీ సర్కారుకు ఆ కమిటీ తన నివేదికను అందజేసింది. ఇంతకీ ఆ కమిటీ ఏమేం ప్రతిపాదనలు చేసిందంటే..

  ’స్త్రీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అమ్మాయిల కనీస పెళ్లి వయసును పెంచే దిశా ఆలోచన చేస్తున్నాం. మన ఆడబిడ్డలు పోషకాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే ఈ పెళ్లి వయసు పెంపు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.‘ అని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అత్యంత వేగంగా జరిగింది. సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ, నీతి ఆయోగ్ సభ్యులు వీకే పౌల్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పడింది. ఆరోగ్య శాఖ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ, ప్రాధమిక విద్యాశాఖ సెక్రటరీలు, ముంబైలోని ఎస్ఎన్ డీటీ మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, గుజరాత్ లోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దీప్తీ షాహ్ లతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటయింది. మొత్తానికి వీరందరి కృషితో కేంద్ర ప్రభుత్వానికి ’అమ్మాయిల కనీస పెళ్లి వయసు‘ గురించి ఓ కీలక నివేదిక అందింది.  ’మన భారత దేశంలో రాత్రికి రాత్రే అమ్మాయిల పెళ్లి వయసును 21కి పెంచడం సాధ్యం కాదు. ఇది దశల వారీగా జరగాలి. దీన్ని అమలు చేసేందుకు రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. అమ్మాయిల పెళ్లి వయసు 21కి పెరిగితే చాలా లాభాలు ఉన్నాయి. భారతీయ కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. అమ్మాయిల్లో మానసిక పరిపక్వత కూడా పెరిగి, సమాజం గురించి అవగాహన వస్తుంది. అమ్మాయిలు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో వారి వయసు తప్పనిసరిగా 21 ఏళ్లు ఉంటే ఆరోగ్య పరంగానూ ఇబ్బందులు ఎదురవ్వవు. 2016లో కర్ణాటక ప్రభుత్వం అమ్మాయిల పెళ్లి వయసు విషయంలో కీలక చట్టాన్ని చేసింది. దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో అమలుచేసింది. దీని ఫలితాలు కూడా క్షేత్ర స్థాయిలో బాగున్నాయన్న సమాచారం అందింది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి‘ అని కమిటీ తన రిపోర్టులో తెలియజేసింది. మొత్తానికి అమ్మాయిల కనీస పెళ్లి వయసును పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం శుభపరిణామం అని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి.
  Published by:Hasaan Kandula
  First published:January 15, 2021, 14:16 IST

  टॉप स्टोरीज