Shocking incident : ఇండియాలో చాలా ప్రాంతాల్లో తరచూ కోడి పందేలు(Cockfight) నిర్వహిస్తుంటారు. పండగల సీజన్‌లో కోడి పందేల జోరు పెరుగుతుంది. రూ.లక్షల్లో బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. మూగజీవుల హింస, జూదం వంటి కారణాలతో కోడి పందేలను నిషేధించారు. అందుకే కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తుంటారు. నిర్వాహకుల అరెస్టులు, వాహనాలు, డబ్బు స్వాధీనం వంటివి షరా మామూలే. అయితే ఇటీవల ఒడిశాలోని ఓ ప్రాంతంలో దాడులు చేసిన పోలీసులు నాలుగు కోడి పుంజుల(Roosters)ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వింతే ముంది అంటారా? పోలీసులు వాటిని దాదాపు రెండు రోజులు కస్టడీలో(Cocks in police custody) ఉంచుకున్నారు. వాటి పూర్తి సంరక్షణ బాధ్యతలు పోలీసులే చూసుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన పూర్తి వివరాలు ఇలా..
రెండు రోజులపాటు కోడి పుంజుల సంరక్షణ
డిసెంబర్ 25న ఒడిశా , బాలాసోర్ జిల్లా, సిములియాలోని మురునా గ్రామపంచాయతీ మంజరీపూర్ గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిములియా పోలీసులు ఆ స్ధావరంపై దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి నాలుగు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకొన్న వ్యక్తులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం(Prevention of Cruelty to Animals Act) కింద కేసు నమోదు చేశారు. నాలుగు కోడి పుంజులను పోలీసులు తమ కస్డడీలోనే రెండు రోజులు ఉంచుకోవాల్సి వచ్చింది.కస్టడీలో ఉన్నప్పుడు వాటికి ఆహారం ఇవ్వడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా పోలీసులే చేయాల్సి వచ్చింది.
కోడి పందేలపై పోలీసుల నిఘా
కొత్త సంవత్సరం ప్రారంభం సమయంలో, పండగ రోజుల్లో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తారు. ప్రస్తుతం కోడి పందేల బెట్టింగ్ కార్యకలాపాలపై సిములియా పోలీసులు నిఘా ఉంచారు. ఇప్పుడు మొదలయ్యే కోడి పందేలు జనవరి మధ్య వరకు జోరుగా సాగుతాయి. మంజరీపూర్ గ్రామంలో సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు.. పందేలు మొదలైన వెంటనే చర్యలు తీసుకున్నారు.
Alcohol Lovers: మద్యంప్రియుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.. ఆల్కహాల్ లవర్స్ సంఘం డిమాండ్స్ ఇవే
కోడి పుంజులకు వైద్య పరీక్షలు
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరోగ్య తనిఖీ కోసం కోడి పుంజులను సిములియా వెటర్నరీ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. కోడి పుంజుల ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని నిర్ధారించిన తర్వాత, వాటిని యజమానులకు తిరిగి అప్పగించారు. భవిష్యత్తులో ఇటువంటి పందేలలో పాల్గొనమని, జంతు హింసను ప్రోత్సహించమని యజమానుల నుంచి లిఖితపూర్వకంగా అంగీకారం తీసుకున్నామని సిములియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్-ఇన్-ఛార్జ్ జయంత బెహెరా తెలిపారు. కోడి పుంజుల ఆహారం, వైద్య ఖర్చుల కోసం పోలీసులు రూ.5 వేలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha