పార్లమెంట్, అసెంబ్లీల్లో అర్థవంతమైన చర్చలు జరగాలి. కానీ ఇప్పుడు చర్చ కాదు.. చట్ట సభల్లో రచ్చ జరుగుతోంది. సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చిఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజ్యసభలో జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై విషయం తెలిసిందే. రైతుల సమస్యలపై చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చిరచ్చరచ్చ చేశారు. కొందరు టేబుళ్లపైకి ఎక్కడి పేపర్లను చింపివేశారు. ఛైర్మన్ సీటుపైకి రూల్ బుక్‌ని విసిరేశారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చట్ట సభల తీరుపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బాధనిపిస్తోందని.. చర్చల ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
''దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పార్లమెంటులో చర్చలు ఫలప్రదంగా సాగేవి. చట్ట సభల్లో సుదీర్ఘ చర్చలు జరిపేవారు. కానీ, ఇప్పుడు పార్లమెంటులో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. నేటి పరిస్థితులను చూస్తుంటే బాధనిపిస్తోంది. చర్చల ప్రమాణాలు పడిపోయాయి. చట్టాల్లో చాలా అసందిగ్ధత, అస్పష్టత కనిపిస్తున్నాయి. అసలు ఈ చట్టాలను ఎందుకు రూపొందిస్తున్నారో అర్థం కావడం లేదు. వీటి వల్ల కోర్టులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి చట్టాల వల్ల కోర్టులకు వచ్చే కేసుల సంఖ్య పెరుగుతోంది.'' అని ఎన్వీ రమణ పేర్కొన్నారు.
న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి, చట్ట సభలకు రావాలని ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులకు సంపాదనే పరమావధి కాకూడదని ఆయన హితవు పలికారు.
ఆగస్టు 10న రాజ్యసభలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి దాదాపు గంటన్నర సేపు ఆందోళన చేశారు. మార్షల్స్‌ని నెట్టివేశారు. ఈ పరిణామాపై ఆమరుసటి రోజు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీల అనుచిత ప్రవర్తన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
''ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం లాంటింది. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. చట్టసభల పవిత్రను దెబ్బతీశారు. టేబుల్‌పై కూర్చున్నారు. మరికొందరు టేబుల్స్‌పై నిలబడ్డారు. పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భ గుడిలో నిరసన తెలిపినట్లే.నిన్నటి పరిణామాలను తలచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణమం. సభలో ఇన్ని రోజుల పాటు కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచిది కాదు.'' అని వెంకయ్యనాయుడు అన్నారు. తాజాగా సీజేఐ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
వయసు ఐదేళ్లు.. రికార్డులు తొమ్మిది: కేరళ విద్యార్థిని పత్రిభ
దేశంలోని బాలికలకు ప్రధాని మోదీ శుభవార్త.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NV Ramana, Parliament, Supreme Court