CJI: ఇటీవల మూన్‌లైటింగ్ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా మూన్‌లైటింగ్ చర్చ మొదలైంది. కరోనా సమయంలో వర్క్‌ఫ్రమ్ విధానం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మూన్‌లైటింగ్(Moonlighting) చేశారని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఒక కంపెనీ పేరోల్ కింద పనిచేస్తూ.. అదనపు ఆదాయం కోసం మరో కంపెనీలో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఈ సమస్య ప్రొడక్టివిటీని దెబ్బతీస్తోందని పేర్కొంటూ ఇండియాలోని బడా సాఫ్ట్వేర్ కంపెనీలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. మూన్‌లైటింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తామని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఉద్యోగులను హెచ్చరించాయి. అయితే తాజాగా మూన్‌లైటింగ్ గురించి భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ వై చంద్రచూడ్(DY Chandrachud) మాట్లాడారు. తాను కూడా మూన్‌లైటింగ్ చేసినట్లు ఆయన చెప్పారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీజేఐ ఆల్ ఇండియా రేడియోలో మూన్‌లైటింగ్
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనుంజయ్ వై చంద్రచూడ్, తాను ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో రేడియో జాకీ (ఆర్జే)గా మూన్ లైటింగ్ చేసినట్లు చెప్పారు. లాయర్‌గా పనిచేస్తున్నప్పుడే ఆల్ ఇండియా రేడియోలో ప్లే ఇట్ కూల్, ఎ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్ వంటి షోలను హోస్ట్ చేసినట్లు చెప్పారు. ఇటీవల ఆయన షేర్ చేసుకున్న ఈ వివరాలను బార్ & బెంచ్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
ఓ కాన్ఫరెన్స్‌లో చంద్రచూడ్ మాట్లాడుతూ.. చాలా మందికి ఈ విషయం తెలియదని అన్నారు. తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో(AIR)లో రేడియో జాకీగా పనిచేశానని చెప్పారు. ప్లే ఇట్ కూల్, డేట్ విత్ యు, సండే రిక్వెస్ట్ వంటి కార్యక్రమాలను హోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. తనకు సంగీతం అంటే ఇష్టమని, సంగీతంపై ఉన్న అభిమానం నేటికీ కొనసాగుతోందని చెప్పారు. కోర్టులో సంగీతమే లేని లాయర్ల సంగీతం విన్న తర్వాత, తిరిగి ఇంటికి వెళ్లి పాటలు వింటానని చంద్రచూడ్ వెల్లడించారు.
వామ్మో.. ఐదేళ్ల బుడతడి ట్యాలెంట్ కు నెటిజన్లు ఫిదా... 190 సెకన్లలో.. 195 దేశాల పేర్లు ఇంకా..
సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాల తొలగింపు
ఇటీవల భారతదేశంలోని పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. 2022 అక్టోబర్‌లో ఐటీ కంపెనీ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీ(Happiest Minds Technologies) మూన్‌లైటింగ్ కారణంతో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్‌లో.. మూన్‌లైటింగ్‌ను మోసంతో సమానంగా అభివర్ణించారు. టీసీఎస్ కంపెనీ కూడా ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌పై ఓ ఇంటర్నల్ లేఖ రాసింది. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను మూన్‌లైటింగ్‌పై హెచ్చరించాయి. కంపెనీ నియమ నిబంధనల ప్రకారం.. తమ కంపెనీలో పని చేస్తూ, మరో కంపెనీలో వర్క్ చేయడం ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: All india radio