ఓవైపు పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act)పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నా... 12 రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నా... కేంద్ర ప్రభుత్వం... శుక్రవారం నుంచీ CAAను అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి... కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ చట్టం ప్రకారం... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లో 2014 డిసెంబర్ 31కి ముందు... మతపరమైన వేధింపులు ఎదుర్కొంటూ... భారత్ వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు భారతీయ పౌరులుగా పౌరసత్వం కల్పించనున్నారు. ఆ మూడు దేశాల నుంచీ వచ్చే ముస్లింలకు మాత్రం ఈ పౌరసత్వం లభించదు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9న పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)ను లోక్సభలో ప్రవేశపెట్టి 10న ఆమోదం పొందింది. తర్వాతి రోజు రాజ్యసభలోనూ బిల్లు పాసైంది. డిసెంబరు 12న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బిల్లును ఆమోదించారు. ఇప్పుడీ చట్టం అమల్లోకి వచ్చినట్లైంది. ఐతే... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందంటూ... అభ్యంతరం తెలుపుతున్నాయి. అలాగే ఈ చట్టం వల్ల తమకు విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు తగ్గిపోతాయని కొన్ని వర్గాల ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.