CISF ISSUES NEW SOCIAL MEDIA GUIDELINES ASKS PERSONNEL TO DISCLOSE THEIR USER IDS
ఫేస్బుక్, ట్విట్టర్ వాడుతున్నారా? జవాన్లకు CISF సోషల్ మీడియా మార్గదర్శకాలు
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తమ సిబ్బందికి కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్లోని తమ సోషల్ మీడియా ఖాతాల యూజర్ ఐడీలను సీఐఎస్ఎఫ్ జవాన్లు వెల్లడించాల్సి ఉంటుంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్లోని తమ సోషల్ మీడియా ఖాతాల యూజర్ ఐడీలను సీఐఎస్ఎఫ్ జవాన్లు వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా వారు ప్రభుత్వ విధాన నిర్ణయాలను విమర్శించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో ఇప్పటికే తామిచ్చిన ఆదేశాలను కొందరు జవాన్లు ఉల్లంఘిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ పేర్కొంది. దేశానికి, సీఐఎస్ఎఫ్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపింది. తాజా మార్గదర్శనాలకు అతిక్రమించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన చట్టాలు ఇప్పటికే ఉన్నట్లు గుర్తుచేసింది.
తక్షణమే జవాన్లు తమ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రమ్ తదితర అన్ని సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన యూజర్ ఐడీలను వెల్లడించాలని కోరింది. ఏవైనా కారణాలతో యూజర్ ఐడీని మార్చినా...వెంటనే కొత్త ఐడీని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది.ప్రభుత్వ విధాన నిర్ణయాలను విమర్శించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటే సహించేది లేదని తన ఆదేశాల్లో సీఐఎస్ఎఫ్ స్పష్టంచేసింది. అలాగే తమ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకోవడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించేది లేదని సీఐఎస్ఎఫ్ తేల్చిచెప్పింది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.