China's Hackers: చైనా కంటే గుంట నక్క వెయ్యి రెట్లు మేలు. ఎందుకంటే నక్క తన ఆహారం కోసం, ఆకలి తీర్చుకోవడానికే అడ్డదారులు వెతుక్కుంటుంది. చైనా అలాకాదు... పక్క దేశాలను ఎలా ముంచుదామా అని చావు తెలివి తేటల్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అలాంటి ఓ భారీ కుట్ర కోణం ఇప్పుడు బయటపడింది. 2020 మేలో భారత్ లోని 12 రాష్ట్రాల్లో పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ లోడ్ చేసే NTPC లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోని కంప్యూటర్ నెట్‌వర్కులకు టెక్నికల్ సమస్య వచ్చింది. అలా ఎందుకు జరిగిందో వెంటనే తెలియలేదు. లోతుగా విశ్లేషించగా తాజాగా అసలు విషయం తెలిసింది. చైనా ప్రభుత్వ సపోర్టుతో రెచ్చిపోతున్న హ్యాకర్ గ్యాంగులు... ఓ మాల్వేర్ (malware) కంప్యూటర్లలోకి పంపినట్లు తాజా అధ్యయనంలో తేలింది.
అమెరికాకి చెందిన కంపెనీ రికార్డెడ్ ఫ్యూచర్... ఈ అధ్యయనం జరిపింది. ఈ సంస్థ... మన దేశంలోని NTPC, ఇతరత్రా ఎలక్ట్రిసిటీ సంబంధిత సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ సప్లై సరిగా జరిగేలా... సప్లైకి సరిపడా డిమాండ్... డిమాండ్‌కి సరిపడా సప్లై ఉండేలా చేస్తుంది. ఐతే... పవర్ సప్లై సంస్థలపై హ్యాకింగ్ దాడులు జరగడం అప్పట్లో కలకలం రేపింది. హ్యాకర్లు దాడి చేసేంత ఈజీగా మన పవర్ సప్లై సంస్థలు ఎందుకున్నాయన్న ప్రశ్న వచ్చింది. ఇండియన్ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NCIIPC) ప్రకారం... 12 సంస్థల్లో మౌలిక వసతులు సరిగా లేవు. అంటే అవి హ్యాకర్ల దాడుల్ని ఆపేలా లేవని అర్థం. అంటే వాటిలో మరింత హై సెక్టూరిటీ ఫీచర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లే.
2020 అక్టోబర్ 13 ముంబైలో పెద్ద ఎత్తున కరెంటు పోయింది. ఏకంగా సగం ముంబై అంధకారంలోకి వెళ్లిపోయింది. అప్పుడు పద్ఘాలోని కరెంటు లోడ్ పంపే కేంద్రంలో ఓ మాల్వేర్‌ను గుర్తించారు. అది కూడా చైనా పనే అంటున్నారు. గతేడాది జూన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య లఢక్ సరిహద్దులోని తూర్పు గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఇలా ఇండియా ఎదుగుదలను ఓర్వలేకపోతున్న చైనా రకరకాలుగా దెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. అంతెందుకు... ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కలర్స్ గేమ్ అనే బెట్టింగ్ గేమ్ నడుస్తోంది. అలాంటి గేమ్ వెబ్‌సైట్లు దాదాపు 50 దాకా ఉన్నాయి. అవన్నీ చైనా నుంచే నడుస్తున్నాయి. ఈ సైట్లు భారతీయ యువతను టార్గెట్ చేస్తూ... బెట్టింగ్ పేరుతో... రోజూ వందల కోట్లు లాగేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Black Sesame: మీ తలరాతను మార్చగల నల్ల నువ్వులు... ఇలా చెయ్యండి
ఈ కుట్రలన్నింటి వెనుక... చైనా ఆర్మీ (PLA) హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాకర్ల గ్రూపులకూ, చైనా ఆర్మీకీ లింక్ ఉంటుందని తెలిసింది. విద్యుత్ రంగాన్నే కాకుండా... కొన్ని ప్రభుత్వ, రక్షణ రంగ సంస్థలపైనా చైనా హ్యాకర్లు గురి పెట్టినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే... చైనా డైరెక్టుగా ఇండియాతో పెట్టుకుంటే కలిసిరాదని... ఇలా పరోక్షంగా కుట్రలు పన్నుతున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China