భారత్, చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. లద్దాఖ్‌కు తూర్పున ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పలుమార్లు ఘర్షణ పడ్డాయి. గత ఏడాది జూన్‌లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మన అమర వీరులకు యావత్ భారతం కన్నీటితో వీడ్కోలు పలికింది. కానీ ఆ ఘర్షణలో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించింది. కానీ చైనా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఐతే గల్వాన్ లోయ ఘర్షణతో చైనా సైనికుల మరణంపై తొలిసారిగా స్పందించింది. ఆ ఘటనలో మరణించిన వారి పేర్లు, వివరాలను బయటపెట్టింది.
అంతేకాదు గల్వాన్ లోయ ఘర్షణల్లో ప్రాణ త్యాగం చేసిన నలుగురు సైనికులకు హానరరీ టైటిల్‌తో సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది. ఆ రోజు సైనా జవాన్లకు నాయకత్వం వహించిన కల్నల్‌కు కూడా అవార్డును ప్రకటించింది. ప్రాణత్యాగం చేసిన వారిలో చెన్ హాంగ్‌జున్, చెన్ జియాన్‌గ్రాంగ్, గ్జియో సియువాన్, వాంగ్ జోరాన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు చైనాకు చెందిన పీపుల్స్ డైలీ కథనాన్ని ప్రచురించింది. కల్నల్ కీ ఫాబో తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.
Chinese top military body Central Military Commission awards 4 Chinese soldiers who lost their lives in the Galwan clash pic.twitter.com/JZ3ZeeIpWK
— ANI (@ANI) February 19, 2021
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జూన్ 15 రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కనీసం 30 మంది మరణించి ఉంటారని అప్పట్లోనే భారత ఆర్మీ తెలిపింది. 45 మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇలా ఎన్నో రకరకాల ఊహాగానాలు వినిపించినా.. చైనా మాత్రం నోరు విప్పలేదు. కానీ తొలిసారి వారి వివరాలను వెల్లడించింది. ఐతే నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది డ్రాగన్.
కాగా, గల్వాన్ ఘటనలో చైనా వైపు కూడా భారీగా నష్టం జరిగిందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నార్తన్ కమాండ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఇటీవల CNN News18 డిఫెన్స్ ఎడిటర్ శ్రేయా ధోండియాల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చాలామంది సైనికులను అక్కడి నుంచి స్ట్రెచర్స్పై తీసుకెళ్లారని జనరల్ వైకే జోషి తెలిపారు. అలాంటి వారి సంఖ్య దాదాపు 60 వరకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే వారిలో ఎంతమంది చనిపోయారు ? ఎంతమంది బతికున్నారనే విషయాన్ని చెప్పలేమని అన్నారు. అయితే ఇటీవల టస్ అనే రష్యన్ ఏజెన్సీ.. చైనా వైపు చనిపోయిన వారి సంఖ్య 45 వరకు ఉంటుందని పేర్కొన్నట్టు తెలిపారు. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చని వైకే జోషి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Galwan Valley, India-China, Ladakh