పాఠశాల విద్య(School Education)పై తల్లిదండ్రుల ఆవేదన అంశంలో సుప్రీం కోర్టు(Supreme Court) సోమవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపకూడదని సుప్రీం కోర్టు(Supreme Court) అభిప్రాయపడింది. పిల్లలను పాఠశాలలకు పంపే విషయంలో ఒక రకమైన హడావిడి ఉందని, కొందరు తల్లిదండ్రులు(Parents) తమ పిల్లలకు రెండేళ్లు నిండిన వెంటనే బడికి పంపాలని భావిస్తున్నారని, ఇలాంటి వాటికి పిల్లల మానసిక ఆరోగ్యం(Health) అనుకూలంగా ఉండకపోవచ్చని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుందరేష్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయంలో(Kendriya Vidyalaya) 1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితి ఆరేళ్లుగా ఉండటాన్ని సవాల్ చేస్తూ తల్లిదండ్రుల బృందం చేసిన అప్పీల్‌పై బెంచ్ విచారణ చేపట్టింది. 2022 మార్చిలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి కేవలం నాలుగు రోజుల ముందు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) 1వ తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయసు ఉండాలని ప్రమాణాలను అకస్మాత్తుగా మార్చిందని, ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. అంతకముందు 1వ తరగతిలో ప్రవేశానికి ఐదేళ్లు అర్హతగా ఉండేది.
తమ బిడ్డ మేధావి అని అనుకోవడమే సమస్య
ఈ అంశంపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ..‘పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడానికి సరైన వయస్సు ఏంటనే అంశాన్ని తెలియజేయడానికి అధ్యయనాలు ఉన్నాయి. పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి చర్యలు పిల్లల్లో చదవగల సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మానసికంగానూ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.’ అని పేర్కొంది. ఈ సందర్భంలో.. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా వయస్సు ప్రమాణాలను మార్చడం ప్రవేశ ప్రక్రియలో పాల్గొనే హక్కు ఉన్న విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం వారి హక్కును కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని పిటిషనర్లు వాదించారు.
కానీ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. న్యాయమూర్తులు స్పందిస్తూ..‘అసలు సమస్య ఏమిటంటే, తల్లిదండ్రులు తమ బిడ్డ ఏ వయస్సులోనైనా అంశాలను నేర్చుకోగల మేధావి అని భావిస్తారు. పిల్లల గురించి, అతని మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించరు. ప్రతి పనిని ప్రారంభించడానికి సరైన వయస్సు ఉంటుంది. అందులో పాఠశాలలు కూడా ఉన్నాయి. వాస్తవానికి పిల్లలు చాలా చిన్న వయసులో బడిలో చేరకపోతే మెరుగ్గా రాణిస్తారని చూపించడానికి కొన్ని అధ్యయనాలు ఉన్నాయి.’ అని తల్లిదండ్రుల బృందం తరఫున హాజరైన న్యాయవాదికి తెలిపారు.
* వచ్చే సంవత్సరం అర్హత సాధిస్తారు..
అడ్మిషన్ వయస్సుకు సంబంధించి ఏకరూపతను నిర్ధారించే ఉద్దేశ్యంతో వయస్సు ప్రమాణాలను నిర్ణయించిన జాతీయ విద్యా విధానం (NEP) ఆదేశాలను బెంచ్ అంగీకరించింది. విచారణ సందర్భంగా.. 2020లో వచ్చిన ఎన్ఈపీ కింద 21 రాష్ట్రాలు క్లాస్ 1కి సిక్స్ ప్లస్ విధానాన్ని అమలు చేశాయని, ఈ విధానాన్ని సవాలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సూచించారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ధ్రువీకరిస్తూ అప్పీల్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 11న హైకోర్టు తల్లిదండ్రుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. అడ్మిషన్ పొందకుండా పిల్లలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న తల్లిదండ్రుల విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. క్లాస్ 1లో ప్రవేశం కోసం ఇప్పటికే 7 లక్షల దరఖాస్తులు అందాయని, ప్రమాణాల మార్పుతో కేవలం పిల్లలు తర్వాత సంవత్సరం ప్రవేశాలు పొందడానికి అర్హత పొందుతారు తప్ప మరో ఇబ్బంది లేదని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Parents, School, Supreme Court