ప్రముఖ వ్యక్తులపై ఉండే అభిమానాన్ని ప్రత్యేక పద్ధతుల్లో చూపిస్తుంటారు వారి అభిమానులు. మన దేశంలో ప్రముఖుల కోసం ప్రత్యేకంగా గుడి కట్టించిన సందర్బాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)కు గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు ఒక వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. ప్రభాకర్ మౌర్య అనే 32 ఏళ్ల ఆధ్యాత్మిక గాయకుడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)పై అభిమానంతో ఏకంగా ఒక ఆలయం (Temple) కట్టించారు. ఈ ఆలయంలో యోగి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు కూడా చేస్తున్నారు.
అయోధ్య (Ayodhya)లో రామజన్మభూమి వద్ద రామమందిరాన్ని చూడాలనే బలమైన కోరిక చాలామంది హిందువులలో ఉంది. వారిలో ప్రభాకర్ మౌర్య ఒకరు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే వ్యక్తికి గుడి కట్టించి, పూజించాలని 2015లోనే మౌర్య ప్రతిజ్ఞ చేశారు. కాగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో రామమందిరం నిర్మితమవుతోంది. దీంతో రామమందిరాన్ని ఆదిత్యనాథ్ నిర్మిస్తున్నారని ఆయనకు ఒక గుడి కట్టించారు. రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే మౌర్య గుడి కట్టించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు.
ప్రభాకర్ మౌర్య రామజన్మభూమి ( Ram Janmabhoomi)కి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యలోని ప్రయాగ్‌రాజ్ హైవేపై సీఎం యోగి పేరిట ఆలయాన్ని నిర్మించారు. రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత తమ్ముడు భరతుడు ఇదే ప్రాంతంలో రాముడి చెప్పులు ఉంచాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇదే ప్రదేశంలో రాముడికి భరతుడు వీడ్కోలు చెప్పాడని అంటారు.
ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో మౌర్య గుడిని నిర్మించి అందులో ప్రతిష్టించడానికి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని తయారు చేయించారు. ఆదిత్యనాథ్ నిజజీవితంలో 5.4 అడుగుల ఎత్తు ఉంటారు. కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అందుకే ఈ విగ్రహాన్ని కాస్త ఎత్తుగా, కాషాయ వస్త్రధారణలో తయారు చేయించారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాకు చెందిన మౌర్య స్నేహితుడు ఈ విగ్రహాన్ని రెండు నెలల పాటు శ్రమించి తయారు చేశారు.
రామమందిరాన్ని నిర్మిస్తున్న ఆదిత్యనాథ్‌ని శ్రీకృష్ణ భగవానుడితో సమానంగా భావించి అతని విగ్రహం కుడిచేతిలో విల్లు, వెనుక బాణం కూడా ఉంచారు. శ్రీరాముడు విగ్రహం వలే తయారు చేయించి గుడిలో ప్రతిష్ఠించారు. అంతేకాదు శ్రీరాముడిని పూజించినట్టే హారతి సమయంలో యోగి విగ్రహం ముందు రోజూ శ్లోకాలు చదువుతున్నారు.
ఇది కూడా చదవండి : యూటర్న్ తీసుకున్న మమతా బెనర్జీ... ప్రధాని మోదీ , అమిత్ షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..
సీఎం యోగి ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చారని.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. అందుకే అతన్ని దేవుడిగా తాను కొలుస్తున్నానని మౌర్య చెబుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, అతని పేరు మీద ఒక మందిరం ఉండాల్సిన అవసరం ఉందని మౌర్య పేర్కొన్నారు.
యోగి కోసం అభిమానంతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలే కాదు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడికి ప్రజలు తరలివచ్చి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో భజనలు, మతపరమైన పాటలను వీడియో రూపంలో పోస్ట్ చేసి నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించే మౌర్య ఈ గుడి నిర్మాణం కోసం ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Uttar pradesh, VIRAL NEWS, Yogi adityanath