Chidambaram | చిదంబరానికి కోర్టు షాక్... 5 రోజుల సీబీఐ కస్టడీ

Chidambaram Case | కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరంను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: August 22, 2019, 6:49 PM IST
Chidambaram | చిదంబరానికి కోర్టు షాక్... 5 రోజుల సీబీఐ కస్టడీ
చిదంబరం అరెస్ట్ (File)
news18-telugu
Updated: August 22, 2019, 6:49 PM IST
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయనకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం 5 రోజుల  కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 26 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉంటారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని భారీ హైడ్రామా తర్వాత ఈనెల 21వ తేదీ రాత్రి 9.45 గంటలకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆయన సీబీఐ అధికారుల కస్టడీలోనే ఉన్నారు. నిన్నటి నుంచి పలు ప్రశ్నలు సంధించిన సీబీఐ.. ఇవాళ మధ్యాహ్నం ఆయన్ను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్ కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. చిదంబరానికి మొత్తం తెలిసే చేశారని ఆరోపించారు. చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. రెండు వారాలు కుదరకపోతే కనీసం 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.

అయితే, ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న కార్తీ చిదంబరానికి 2018లోనే ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని చిదంబరం తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ తరఫు న్యాయవాదుల విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. కేసులో విచారణ పూర్తైపోయి చార్జిషీట్‌లు దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు అరెస్టులు ఏంటని సిబల్ ప్రశ్నించారు. ఈ కేసులో పదేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని, విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆరుగురు కేంద్ర ప్రభుత్వం కార్యదర్శులు సంతకాలు చేశారని సిబల్ వాదించారు. వారెవరినీ అరెస్ట్ చేయలేదని సిబల్ అన్నారు. చిదంబరం ఎక్కడా విచారణ నుంచి పారిపోలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేస్తే, ఇవాళ ఉదయం 11 గంటల వరకు విచారించలేదని సిబల్ వాదించారు. ఇప్పటి వరకు 12 ప్రశ్నలు అడిగిందని సిబల్ అన్నారు. అసలు చిదంబరాన్ని ఏం ప్రశ్నలు అడగాలో కూడా సీీబీఐకి తెలియదని చెప్పారు. సీబీఐ అడిగే ప్రశ్నలతో చిదంబరానికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

కపిల్ సిబల్ తర్వాత అభిషేక్ సింఘ్వీ వాదనలు కొనసాగించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చిన స్టేట్‌మెంట్, కేసు డైరీ ఆధారంగా విచారణ జరుగుతోందని, ఇంద్రాణి స్టేట్‌మెంట్ ఇచ్చిన నాలుగు నెలల తర్వాత చిదంబరాన్ని విచారణకు పిలిచారని చెప్పారు. 11 - 12 నెలల వరకు అసలు చిదంబరాన్ని విచారణకే పిలవలేదన్నారు. విచారణలో చిదంబరం తమకు సహకరించడం లేదన్న సీబీఐ వాదనను సింఘ్వీ తప్పుపట్టారు. ‘నాలుగైదు సార్లు పిలిస్తే వెళ్లలేదా? సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. విచారించింది. ఇందులో సహకరించకపోవడం అనే ప్రశ్న ఎక్కడుంది?’ అని వాదించారు. ఎవరో అన్యాపదేశంగా చెప్పిన మాటలను పట్టుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని సింఘ్వీ వాదించారు. సీబీఐ కోరిన ఐదు రోజుల కస్టడీని కూడా ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పి.చిదంబరం ఏదో చెప్పబోయారు. అయితే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు అభ్యంతరం చెప్పారు. కానీ, అభిషేక్ సింఘ్వీ మాత్రం చిదంబరానికి చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నిందితుడికి తన తరఫున వాదన వినిపించే అవకాశం ఉందన్నారు.

అయితే, అత్యంత తెలివితేటలు ఉన్న చిదంబరం విచారణకు సహకరించకుండా ఉండడంలో దిట్ట అని సొలిసిటర్ జనరల్ వాదించారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గతంలో కస్టడీలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తన వాదన వినిపించుకునే హక్కు చిదంబరానికి ఉంటే, విచారించే హక్కు చట్ట ప్రకారం సీబీఐకి కూడా ఉందని సొలిసిటర్ జనరల్ వాదించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం దేశం కోసం తమ విధులు తాము నిర్వర్తించాల్సి ఉంది కాబట్టి, చిదంబరాన్ని విచారించే హక్కును కల్పించాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ తీర్పును అరగంట తర్వాత చెబుతామన్నారు. సాయంత్రం 6.40 గంటలకు తీర్పు చెప్పారు.



 
First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...