CHICK COSTING 10 RUPEES CHARGED RS 52 FOR TRAVELLING ON KSRTC BUS HERE IS INTERESTING DETAILS SK
Bus Ticket For Chick: రూ.10 కోడిపిల్లకు రూ.50 టికెట్... ఆర్టీసీ బస్సులో షాకింగ్ ఘటన
కోడిపిల్లకు బస్సు టికెట్
Karnataka: 10 రూపాయల కోడిపిల్లకు రూ.50ల బస్సు టిక్కెటా..? వావ్..అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ కండక్టర్‌కు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వాలని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మనుషులే కాదు.. అప్పుడప్పుడు పక్షులు, జంతువులు కూడా వెళ్తుంటాయి. చాలా మంది పెంపుడు జంతువులు, సామానులు వంటి లగేజీని కూడా బస్సుల్లో తరలిస్తుంటారు. ఇంకా బియ్యం, సిమెంట్ సంచుల వంటి వాటిని బస్సుల్లో తీసుకెళ్తుంటారు. బరువును బట్టి వాటికి కూడా బస్సు టికెట్ ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు, ఇతర పెంపుడు జంతువులు సైతం ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తుంటాయి. వాటికి కూడా సగం చార్జీ (హాఫ్ టికెట్) వసూలు చేస్తారు. ఐతే కర్నాటకలో ఇలాగే ఓ బస్సు కండక్టర్ కోడి పిల్లకు టికెట్ ఇచ్చాడు. ఇందులో కొత్తేం లేదు. కానీ చిన్న కోడి పిల్లకు ఏకంగా రూ.50 చార్జీ వసూలు చేయడంతో దాని యజమాని ఖంగుతిన్నాడు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. సంచార జాతికి చెందిన ఓ కుటుంబం కర్నాటకలోని శివమొగ్గ జిల్లా హోసనగర వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. అక్కడి నుంచి వారు శిరూరు వెళ్లాల్సి ఉంది. ఐతే వారు తమతో పాటు ఓ చిన్న కోడిపిల్లను కూడా తీసుకెళ్లారు. ముగ్గురు వ్యక్తులకు రూ.101 చొప్పున మొత్తం 303 రూపాయలు బస్సు చార్జీ ఉంటుంది. కానీ బస్సు కండక్టర్ ఏకంగా 353 రూపాయల టికెట్ వేయడంతో వారు షాక్ తిన్నారు. సార్.. మేము ముగ్గురమే ఉన్నాం.. ఇంత చార్జీ వేశారంటని ప్రశ్నించగా.. కండక్టర్ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. మీ చేతిలో కోడిపిల్ల ఉంది కదా.. దానికి కూడా టికెట్ తీసుకోవాలి. మనుషులకు రూ.101 అయితే.. కోడిపిల్లకు హఫ్ టికెట్ కింద రూ.50 చెల్లించాలని చెప్పాడు. మొత్తం కలిపి 353 రూపాయలు ఇవ్వాలని స్పష్టం చేశాడు.
ఏంటి? ఇంత చిన్న కోడిపిల్లకు రూ.50 రూపాయలా? అని ఆ ప్రయాణికులు ప్రశ్నించారు. లగేజీకి చార్జీలు అంతే ఉంటాయని కండక్టర్ స్పష్టం చేయడంతో.. చేసేదేం లేక ఆ డబ్బు చెల్లించి టికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆ టికెట్‌తో పాటు కోడి పిల్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ కోడి పిల్ల ధర 10 రూపాయలు మాత్రమే. ఓ సంతలో రూ.10కి కోడిపిల్ల కొని.. ఆ ముగ్గురు వ్యక్తులు తమ ఊరికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. కానీ దానికి ఏకంగా రూ.50 చార్జీ వేయడంతో.. వారు ఖంగుతిన్నారు. లగేజీ పేరుతో ఇంత దోపిడీ చేస్తారా? అని వాపోతున్నారు. టికెట్ ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఏంటి..? 10 రూపాయల కోడిపిల్లకు రూ.50ల బస్సు టిక్కెటా..? వావ్..అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ కండక్టర్‌కు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వాలని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.