Landless families: భూమి లేని వారి కోసం కొత్త పథకం.. రూ.6వేల ఆర్థిక సాయం..

ప్రతీకాత్మకచిత్రం

భూమి లేని వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి కుటుంబాలకు ఏటా రూ.6 వేలు అందించాలని నిర్ణయించింది.

  • Share this:
భూమి ఉన్న నిరుపేదలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వాలు కూడా సాయం చేస్తుండడంతో కొంత మేర వారికి ఆదాయం వస్తుంది. కానీ భూమి లేని నిరుపేదల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కూలీ పనులే వారికి దిక్కు. ఐతే సాగు భూములు లేని బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై వివిధ రాష్ట్రాలు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా భూమి లేని వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి కుటుంబాలకు ఏటా రూ.6 వేలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ ప్రకటించారు. 2021-22కుగాను సప్లిమెంటరీ బడ్జెట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సప్లిమెంటరీ బడ్జెట్‌గా ₹2,485 కోట్లను పాస్‌ చేసింది. అందులోనే ‘రాజీవ్‌ గాంధీ గ్రామీణ్‌ భూమిహిన్‌ కృషి మజ్‌దూర్‌ న్యాయ్‌ యోజన’ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రతిపాదించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సాగు భూమి లేని వ్యవసాయ కూలీలు, MGNREGA కింద పనులకు వెళ్లేవారు... ఈ కొత్త పథకానికి అర్హులు. వారికి ఏటా ₹6 వేలు ఇస్తారు. దీంతోపాటు క్షురకులు, ధోబీలు, ఉక్కు కార్మికులు, పూజార్లకు కూడా ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. దీని కోసం ఈ సప్లిమెంటరీ బడ్జెట్‌లో ప్రభుత్వం ₹200 కోట్లు కేటాయించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏటా కేంద్రం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేటదట. అయితే ఈ సారి మాత్రం 24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందట. దీంతో మిగిలిన బియ్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులను ఈ కష్ట కాలంలో ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కరోనా తొలి రెండు వేవ్‌ల సమయంలో ఎదురైన ఇబ్బుందుల్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని చర్యలూ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీని కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖకు ₹957 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా పని చేయడమే కాకుండా... ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను కూఆ సరఫరా చేసిన విషయాన్ని సీఎం భూపేష్‌బఘేల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ క్రమంలో దుర్గ్‌ జిల్లాలో ఉన్న చందూలాల్‌ చంద్రకర్‌ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీని అక్వైర్‌ చేసుకోవడానికి ₹39 కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన బిల్‌ను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ప్రత్యేక జైలును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిలాస్‌పూర్‌ జిల్లాలోని నాగోయ్‌ గ్రామంలో ₹126 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 1500 మందిని ఖైదు చేసే అవకాశం ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published: