ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రక్తపు టేరులు పారించారు. దండకారణ్యంలో మారణహోమం సృష్టించారు. బీజాపూర్ జిల్లా జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన జవాన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్నటి ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 22 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్‌దీప్ సింగ్ తెలిపారు. నిన్న ఐదుగురు మృతి చెందగా.. ఇవాళ మరో 17 మంది జవాన్ల మృతదేహాలను గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 31 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు రాయ్‌పూర్‌లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఒకరిద్దరు గల్లంతయ్యారని.. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మారణాయుధాలు వాడినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. లైట్ మెషీన్ గన్స్ (LMG), అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్ (UBGL), దేశీ రాకెట్స్ ఉపయోగించారని పేర్కొన్నారు. లైట్ మెషీన్ గన్స్ వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెప్పారు. మోర్టార్స్‌లతో పాటు బుల్లెట్ల వర్షం కురిపించడంతో మొదట చాలా మంది జవాన్లను గాయపడ్డారు. వారిని మిగతా జవాన్లు ఓ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. వారిపై మరోసారి దేశీ రాకెట్లతో విరుచుకుపడడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. పక్కా ప్రణాళికతోనే భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్‌దీప్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు.
#WATCH | On ground visuals from the site of Naxal attack at Sukma-Bijapur border in Chhattisgarh; 22 security personnel have lost their lives in the attack pic.twitter.com/nulO8I2GKn
— ANI (@ANI) April 4, 2021
ఏప్రిల్ 2న సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో కూడిన 2వేల మంది జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, CRPF, Maoist attack, Maoists