హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

జవాన్ల చేతులు నరికి.. చిత్రహింసలు పెట్టి.. పాశవికంగా హత్య.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో సంచలన నిజాలు

జవాన్ల చేతులు నరికి.. చిత్రహింసలు పెట్టి.. పాశవికంగా హత్య.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో సంచలన నిజాలు

మావోలపై ఆంధ్రా పోలీసుల పంజా

మావోలపై ఆంధ్రా పోలీసుల పంజా

మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాటెండ్ మడ్వి హిడ్మా.. తారెమ్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఓ పుకారు సృష్టించారు మావోయిస్టులు. అది నిజమని నమ్మి అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు భధ్రతా సిబ్బందిపై మెరుపు దాడి చేశారు.

ఇంకా చదవండి ...

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు అసువులు బాశారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నారు. ఐతే శనివారం బీజాపూర్‌లో జరిగిన ఎదురు కాల్పుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టులు పక్కా ప్లాన్‌తోనే భద్రతా సిబ్బందిని ట్రాప్ చేసి చంపేసినట్లు అధికారులు చెబుతున్నారు. మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాటెండ్ మడ్వి హిడ్మా.. తారెమ్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఓ పుకారు సృష్టించారు మావోయిస్టులు. అది నిజమని నమ్మి అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు భధ్రతా సిబ్బందిపై మెరుపు దాడి చేశారు.

తారెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఇంగ్లీష్ అక్షరం U ఆకారంలో మోహరించారు. మరోవైపు నుంచి భద్రతా సిబ్బంది రాగానే.. మూడు వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఊహించని ఆ దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది జవాన్లు బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. మరికొందరు భయంతో అడవుల్లోకి పారిపోయారు. ఐతే బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఓ జవాన్ చేతులను కట్ చేసి.. చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు గాయాల పాలైన జవాన్లలో చాలా మంది బతికేవారు. కానీ ఎక్కువ సేపు ఎదురుకాల్పులు జరగడంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టమయింది. ఎండలతో డీహైడ్రేషన్‌కు గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన జవాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లాక్కొని మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మారణాయుధాలు వాడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. లైట్ మెషీన్ గన్స్ (LMG), అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్ (UBGL)తో పాటు దేశీ రాకెట్స్ ఉపయోగించారని వెల్లడించారు. లైట్ మెషీన్ గన్స్ వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్‌దీప్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ఆరాతీశారు. ప్రతీకారం తప్పదని మావోయిస్టులను ఆయన హెచ్చరించారు. అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జవాన్ల మృతిపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు విచారం వ్యక్తం చేశారు.

ఎవరీ హిడ్మా?

మడ్వి హిడ్మా..మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత. అతడి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా పూవర్తి గ్రామం. హిడ్మా వయసు 40 ఏళ్ల వరకు ఉండవచ్చు. 1990ల్లో అతడు మావోయిస్ట్ దళంలో చేరాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ (PLGA) మొదటి బెటాలియన్‌కు హెడ్‌గా ఉన్నాడు. 180 నుంచి 250 మంది మావోయిస్టులకు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. అంతేకాదు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగానూ ఉన్నాడు. హిడ్మా నేతృత్వంలో గతంలో ఎన్నో మావోయిస్టు దాడులు జరిగాయి. ఇతడిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న హిడ్మా కోసం భద్రతా దళాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి.

కాగా, ఏప్రిల్ 2న సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో కూడిన 2వేల మంది జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. పారిపోయిన మావోయిస్టులతో పాటు గల్లంతైన జవాన్ల కోసం ప్రస్తుతం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది.

First published:

Tags: Chhattisgarh, Encounter, Maoist attack, Maoists

ఉత్తమ కథలు