సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచీ తెలంగాణ విడిపోయిన తర్వాత, ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు అందుకున్న చంద్రబాబు, ఎన్టీయేతో మైత్రిని కొనసాగిస్తూ, రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఐతే, మూడున్నర ఏళ్ల తర్వాత, పరిస్థితి మారింది. ఎన్డీయేకి కటీఫ్ చెప్పిన టీడీపీ అధినేత, ఏకంగా దేశమంతా విస్తరించిన బీజేపీ ఉనికినే ప్రశ్నించాలనుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏపీలో బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలే. తన సీటుకే ఎసరు పెట్టేంత సాహసానికి ఒడిగట్టిన బీజేపీని కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత పొలిటికల్ సినారియో చూస్తుంటే.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో చిన్నా, పెద్దా అన్ని పార్టీలనూ కలుపుకుపోతూ, ఎన్టీయేతర ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, తాజాగా ఎన్టీయేలో చీలికపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీలతో మంతనాలు సాగిస్తున్న ఆయన... త్వరలో మిగతా పార్టీల నేతలతోనూ చర్చలు జరుపనున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికలు ముగిశాక, డిసెంబర్ 22 తర్వాత బాబు మరింత దూకుడుగా ముందుకెళ్తారన్నది టీడీపీ వర్గాల మాట.
చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో పర్యటించారు. 15 రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరపడమే కాదు... వాళ్లందర్నీ బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టేలా చేస్తున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు కలవగానే... యూపీఏలోని కొన్ని పార్టీలు టీడీపీకి సానుకూలంగా మారాయి. ఐతే... దేశంలోని 15 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉండి, మరో 4 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీని ఢీకొట్టాలంటే, ఈ మాత్రం బలం సరిపోదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎన్టీయేలో పార్టీలను కూడా తనవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్డీయేలో 45 పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. వాటిలో 11 పార్టీలకు మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది. ఆ పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు చంద్రబాబుతో టచ్లో ఉన్నారు.
మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారనీ, ఇలాగైతే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని ప్రచారం చేస్తున్న చంద్రబాబు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు మరిన్ని జిల్లాల్లో చేపట్టబోతున్నారు. 20న నెల్లూరు, 27న విజయనగరంలో సభలు జరిపి, ఆ తర్వాత అనంతపురంలో మరో సభ పెట్టి, తెలంగాణ ఎన్నికలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తారని తెలుస్తోంది. అమరావతిలో డిసెంబర్ 22న ధర్మ పోరాట దీక్ష చేపట్టి ఆ దీక్షకు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను పిలుస్తారని సమాచారం. అదే రోజు కొత్త కూటమిలో చేరాలనుకుంటున్న పార్టీలతో సమావేశం జరిపి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే, ఎన్టీయేను చీల్చడం పెద్ద సమస్యేమీ కాదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే, 2019 ఎన్నికల్లో బీజేపీని ఒంటరిని చేసి, ప్రత్యామ్నాయ కూటమితో కేంద్రంలో అధికారంలోకి వచ్చి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Bjp, Bjp-tdp, Chandrababu Naidu, Telangana Election 2018